డాక్టర్ల నిర్లక్ష్యం..మహిళకు HIV వైరస్ రక్తం.. రూ.25 లక్షలు చెల్లించాలన్న కోర్టు

డాక్టర్ల నిర్లక్ష్యం..మహిళకు HIV వైరస్ రక్తం.. రూ.25 లక్షలు చెల్లించాలన్న కోర్టు
తమిళనాడులో ఓ మహిళకు HIV వైరస్ రక్తం ఎక్కించిన ఘటనలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవితకాలం ఆమెకు నెలసరి భత్యం అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 2018లో విరుదునగర్ జిల్లా సత్తూర్ కు చెందిన ఓ గర్భవతి రక్తహీనతతో బాధపడుతూ స్థానిన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆస్పత్రి వర్గాలు ఆమెకు హెచ్ఐవీ వైరస్ రక్తాన్ని ఎక్కించాయి. కొంతకాలం తర్వాత ఆమెకు HIV పాజిటివ్ అని తేలింది. 2019లో ఆమె డెలివరీ కాగా.. బిడ్డకు వైరస్ సోకలేదని తేలింది. అయితే ఆమె పేద మహిళ కావడంతో కొందరు వ్యక్తులు ఆమె తరఫున కోర్టును ఆశ్రయించారు. చేయని తప్పుకు బలైన ఆ మహిళ పట్ల సానుభూతితో స్పందించిన కోర్టు.. రూ.25 లక్షల నష్టపరిహారంతో పాటు ఓ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మహిళ జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ పుగళేంది బెంచ్ ముందు హాజరై, అధికార వర్గాల నుంచి తనకు మరింత సాయాన్ని ఇప్పించాల్సిందిగా అర్థించింది. ప్రమాదకర వైరస్ తో బాధపడుతున్న తనను డాక్టర్లు మంచి ఆహారం తీసువాలని స్పష్టం చేశారని, పండ్లు ఇతర పోషక పదార్థాలు తినాలని చెప్పారని న్యాయమూర్తులకు విన్నవించుకుంది. పేదరాలినైన తాను అంత ఖర్చులు భరించలేకపోతున్నానని, ప్రభుత్వాన్ని ఆదేశించి మరింత సాయం అందేలా చూడాలని కోరింది. దీంతో ఆమె విజ్ఞాపనను మన్నించిన న్యాయస్థానం… నెలకు రూ.7,500 చొప్పున ఆ మహిళకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు.. ఆమెకు తగిన ఉపాధి కూడా కల్పించాలని స్పష్టం చేసింది.