ఏవండోయ్.. మీకు ఈ ఈదమ్మమర్రి చరిత్ర తెలుసా..!

పిల్లల మర్రి అనగానే అందరికీ మహబూబ్ నగర్ కు దగ్గరలో ఉన్న మర్రి చెట్టే గుర్తిస్తుంది. కానీ.. అలాంటిదే మన రాష్ట్రంలో మరొకటి కూడా ఉంది. సుమారు రెండెకరాల్లో విస్తరించి ఉన్న ఈ వృక్షాన్ని ఈదమ్మ మర్రి అని పిలుస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల వయసున్న ఈ చెట్టు కథాకమామిషు ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కుకునూ రులో దన్నె శంకరయ్య అనే రైతు పొలంలో ఉంది. ఈ మర్రి వృక్షం. ఈ చెట్టు కింద ఈదమ్మ తల్లి కొలువై ఉండడంతో దీనికి 'ఈదమ్మ మర్రి'గా పేరొచ్చింది. గతంలో ఈ ప్రాంతాన్ని 'వాసోర్ట్' అనే స్వచ్చంద సంస్థ టూరిస్ట్ ప్లేస్ గా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అందుకు రైతు శంకరయ్య కూడా అంగీకరిం చాడు. తనకున్న మూడెకరాలను తిరిగి ఎవరికీ అమ్మకూడదనే షరతుతో ఆ సంస్థకు అమ్మాడు. "వాసోర్ట్" ఈ స్థలాన్ని కొన్న తర్వాత ఇక్కడ చాలా. డెవలప్ చేసింది. లైబ్రరీ ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టి, ఆకా మిడేషన్ ఇచ్చి చదువు చెప్పించారు. పోలాండ్ నుంచి జగోదా, స్పెయిన్ నుంచి వియోలత అనే ఇద్దరు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉన్నారు. ఇక్కడి స్టూడెంట్లకు పాఠాలు కూడా చెప్పారు. అప్పుడు ఈ ప్రాంతం చాలా డెవలప్ అయ్యింది. ఇక్కడ కొన్ని సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ కూడా జరిగాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాసోర్ట్ సంస్థ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో మళ్లీ పాత కథే ముందుకొచ్చింది. ఆ సంస్థ కట్టించిన భవనాల్లోని ఫర్నీచర్, వస్తువులు అన్నీ దొంగలు ఎత్తుకుపోయారు.

ఈదమ్మ తల్లికి బోనాలు:

ఈ చెట్టు కింద వెలిసిన ఈదమ్మ తల్లికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులు సంబురాలు చేస్తారు. ఇదే ఊరికి చెందిన చింతల దామోదర్ రెడ్డి ప్రతి ఏటా ఈదమ్మ తల్లికి 'బండి బోనం' తీస్తారు. ఊళ్లో వాళ్లంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అంతేకాదు ఊళ్లో రైతులు తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని మొదటగా తల్లికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాతే వాళ్లు తింటారు. ఈ చెట్టు కింద ఈదమ్మ తల్లి ఉందనే కారణంగా ఎండిపోయి కింద పడిన ఈ చెట్టు కొమ్మలను ఎవరూ కాల్చరు. పొయ్యిల కట్టెలుగా కూడా వాడరు. ఈ చెట్టు ఉన్న ప్రదేశాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారిస్తే బాగుండు అంటున్నారు ఆ ఊరి ప్రజలు.

ఎవరూ పట్టించుకోవడం లేదు: 

ఇంత ప్రాముఖ్యం ఉన్నా ఈ చెట్టును ఎవరూ పట్టించుకోవడంలేదు. దీన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తామంటేనే మానాన్న దన్నె శంకరయ్య ఈ చెట్టు ఉన్న స్థలాన్ని వాసార్లు' సంస్థకు అమ్మారు. వాళ్లు ఉన్నంతకాలం బాగానే డెవలప్ చేశారు. కానీ.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
--దన్నె శివరాములు, గ్రామస్థుడు

పర్యాటక కేంద్రంగా మార్చాలి:

ఈదమ్మ మర్రి ఉన్న ప్రదేశాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చాలి. ఈ మహావృక్షాన్ని అంతా కలసి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. దీన్ని ఎవరైనా డెవలప్ చేయడానికి ముందుకొస్తే గ్రామస్తులం అంతా సాయం చేస్తాం
-- లక్ష్మమ్మ, కాకుమార్ సర్పంచ్