మనుగడలో లేని ప్రెస్‌‌‌‌ అకాడమీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌‌‌‌కు తెరపడి నాలుగు నెలలు పూర్తయింది. అయినప్పటికీ ఇరు రాష్ట్రాలకు  పలు చిక్కుముడులు వీడలేదు. అందులో ఒకటి  ‘ప్రెస్‌‌‌‌ అకాడమీ’. ఉమ్మడి రాష్ట్రం విడివడిన తొలినాళ్లలోనే ప్రభుత్వాలకు చెందిన పలు డిపార్టుమెంట్లు, కార్పొరేషన్లు,  అకాడమీల సేవలు ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. అలాంటిదే  ప్రెస్‌‌‌‌ అకాడమీకి చెందిన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌. ఉమ్మడి ఏపీ ప్రెస్‌‌‌‌ అకాడమీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోని సౌకర్యాలను పునరుద్ధరించడంలో రెండు అకాడమీలు విఫలమయ్యాయి. దీంతో జర్నలిస్టులకు సంబంధించిన సమాచారం సకాలంలో తెలుసుకోలేకపోతున్నారు.  

‘ఆర్కైవ్స్’ శీర్షిక కింద ఉన్న గోల్కొండ, ఆంధ్ర జనతా, ఆంధ్రపత్రిక దినపత్రికలతో పాటు పలు వార, పక్ష, మాసపత్రికలు, విలువైన పుస్తకాలకు చెందిన 20 లక్షల పేజీల సంపద. ఉమ్మడి ఏపీ ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌గా పొత్తూరి వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు ఈ పాత పత్రికల డిజిటలైజేషన్‌‌‌‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.  దేవులపల్లి అమర్‌‌‌‌ సంయుక్త ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌గా ఉన్న కాలంలో డిజిటలైజేషన్‌‌‌‌ ప్రక్రియ పూర్తయింది.

తెలంగాణ మీడియా అకాడమీ పూనుకున్నా..

ప్రెస్​ అకాడమీ విభజన తర్వాత ‘ఆర్కైవ్స్’ను తమ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేయడానికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ పూనుకుంది. ఈ మేరకు డేటాను నిర్వహించే నేషనల్‌‌‌‌ ఇన్ఫర్మేటిక్స్‌‌‌‌ సెంటర్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐసీ)ను కోరగా, ఏపీ నుంచి అనుమతి పొందాలని తెలియజేయడంతో నివ్వెరబోయింది. దీంతో తమ వద్దే అసలైనవి ఉన్నాయని తెలంగాణ ప్రెస్‌‌‌‌  అకాడమీ వర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ  దశాబ్ద కాలంగా రెండు రాష్ట్రాల వెబ్‌‌‌‌సైట్లలో ‘ఆర్కైవ్స్‌‌‌‌’ కనిపించకపోవడంతో పరిశోధకులు, చరిత్రకారులు,  జర్నలిస్టులు, విద్యార్థులు, సాహిత్యాభిమానులకు ఇబ్బందికరంగా మారింది. 

Also Read : మూసీ పునరుజ్జీవనంలో సంక్లిష్టతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో డిజిటలైజేషన్‌‌‌‌ చేసి పబ్లిక్‌‌‌‌ డొమైన్‌‌‌‌లోకి అందుబాటులోకి తెచ్చిన వందల ఏండ్ల క్రితం నాటి మ్యాగజైన్లు, పుస్తకాలు, సాహిత్య పత్రికలు దశాబ్ద కాలంగా అందుబాటులో లేవు. గ్రంథాలయాల్లో కూడా ముట్టుకుంటే చినిగిపోయే స్థితిలో అసలు   ప్రతులు ఉన్నాయి.  ఆ రోజుల్లోనే వీటిని అతి జాగ్రత్తగా సేకరించి డిజిటలైజేషన్‌‌‌‌ చేయడం జరిగింది.  వీటన్నింటినీ 2011 నుంచి ఏపీ ప్రెస్‌‌‌‌ అకాడమీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోని ‘ఆర్కైవ్స్‌‌‌‌’ లో అందుబాటులోకి  తెచ్చారు. ఈ డిజిటలైజేషన్‌‌‌‌ నిరంతర ప్రక్రియగా కొనసాగకపోవడంతో 1978 నుంచి వచ్చిన పత్రికలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈనాడు, ఉదయం, వార్త తదితర పత్రికలు, పలు పుస్తకాల కొరత ఏర్పడింది. 

జర్నలిస్టులు, చరిత్రకారుల ఇబ్బందులు

‘ఆర్కైవ్స్‌‌‌‌’ అందుబాటులో లేకపోవడంతో జర్నలిస్టులు, చరిత్రకారుల చెయ్యి విరిగినట్లయింది. ఆయా గ్రంథాలయాలకు పలుమార్లు వెళ్లి సీడీలను వెతికి గంటలకు గంటలు వెచ్చించి అవసరమైన సమాచారాన్ని సేకరించడం తలకు మించిన భారంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌ అధికారిక వెబ్‌‌‌‌సైట్లలో  ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప మరే సమాచారం ఉండటం లేదు. 

తెలంగాణ ప్రెస్‌‌‌‌ అకాడమీ వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌లో ‘ఆర్కైవ్స్‌‌‌‌’ క్లిక్‌‌‌‌ చేస్తే, 1900 సంవత్సరం నుంచి వెలువడిన న్యూస్‌‌‌‌పేపర్లు, మ్యాగజైన్లు వంటి విలువైన సంపద ఉన్నదని,  అప్‌‌‌‌డేట్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేయండని కొంతకాలంపాటు కనిపించింది. దీని లింక్‌‌‌‌గా ఉన్న ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ‘ఆర్కైవ్స్‌‌‌‌’ ను తిరిగి ప్రవేశపెట్టాలని కోరినప్పుడల్లా ‘ఓ నెలలో పునరుద్ధరిస్తాం’ అని సమాధానమిచ్చింది.  ప్రజలకు కలుగుతున్న ఈ అసౌకర్యాన్ని గుర్తించి  ఇరు రాష్ట్రాల ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్లు వీటిపై దృష్టి సారించాలి. 

ముఖ్యంగా తెలంగాణ ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌గా ఉన్న శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అకాడమీ  ప్రక్షాళన  దిశగా కృషి  జరుగుతున్న ఈ సమయంలో వివరాలు తెలుసుకోవడానికి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ అత్యవసరంగా గుర్తించాలి.  అంతేకాకుండా 1979 నుంచి ఇప్పటివరకూ అంచెలవారీగా అన్ని దిన, వార, మాసపత్రికలతోపాటు ముఖ్యమైన పుస్తకాలను డిజిటలైజేషన్‌‌‌‌ చేసి ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. ఇందువల్ల విలువైన వారసత్వ సంపద  ముందుతరాలకు అందుతుంది. 

- కోడం పవన్‌‌‌‌కుమార్‌‌‌‌, సీనియర్ ​జర్నలిస్ట్​-