ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలొద్దు: సుప్రీం 

ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలొద్దు: సుప్రీం 

న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్లను తొలగిస్తామంటూ రాజకీయ నాయకులు ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు సంబంధించిన అంశం గురించి రాజకీయ ప్రకటనలు సరికాదని వ్యాఖ్యానించింది. ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి.. లింగాయత్, వొక్కళిగ సామాజిక వర్గాలకు చెరొక 2% చొప్పున కేటాయిస్తూ కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

మంగళవారం ఈ పిటిషన్‌‌పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ‘‘కర్నాటక ముస్లిం కోటాపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ కోర్టులో పెండింగ్‌‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దు. ఇది సరికాదు’’ అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 25కి వాయిదా వేసింది.