ఈ తలనొప్పి మాకొద్దు.. యువీ ఫౌండేషన్ ప్రకటనలు తొలగిస్తాం..: ఢిల్లీ మెట్రో

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించిన క్యాన్సర్ ఫౌండేషన్ YouWeCan వివాదంలో చిక్కుకుంది. రొమ్ము క్యాన్సర్(Breast Cancer)పై మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ చేసిన ఒక్క ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఆ ప్రకటనలో మహిళల రొమ్ములను ఆరెంజ్‌లతో పోల్చడం ఈ వివాదానికి కారణం. ఈ ప్రకటనపై మహిళల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ మెట్రో అప్రమత్తం అయ్యింది. 

ఇక్కడ ఢిల్లీ మెట్రోకీ.. యువీ ఫౌండేషన్‌కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! YouWeCan ఫౌండేషన్ ప్రచారం చేసిన ఆ ప్రకటనలు.. ఢిల్లీ మెట్రో రైళ్లలో అతికించారు. అలా రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు వాటిని ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువీ ఫౌండేషన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో యాజమాన్యం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

"DMRC ఎల్లప్పుడూ ప్రజల మనోభావాలకు తగ్గట్టు సున్నితంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. మంచి అభిరుచి లేని లేదా ప్రజలను బాధించే, ధిక్కరించే ఏ విధమైన ప్రచార ప్రకటనలను ప్రోత్సహించదు. ఢిల్లీ మెట్రో దీన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి అనుచితమైన ప్రకటనల సంఘటనలు దాని ప్రాంగణంలో జరగవు.." అని DMRC తమ అధికారిక ఎక్స్(X)లో పోస్ట్ చేసింది.

అసలేం జరిగిందంటే..?

క్యాన్సర్ తో పోరాడి జయించిన మాజీ దిగ్గజం యువరాజ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా 2012లో YouWeCan అనే ఫౌండేషన్ స్థాపించారు. ఇటీవల ఈ సంస్థ రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో అక్కడక్కడ ప్రకటనలు అతికించింది. ఆ యాడ్స్ లో రొమ్ములను ఆరెంజ్‌లతో పోల్చారు. 

"నెలకు ఒకసారైనా మీ ఆరెంజ్‌లను తనిఖీ చేసుకోండి.." అని YouWeCan ఫౌండేషన్ యాడ్స్ లో ఉంది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ద్వారా జీవితాన్ని రక్షించుకోగలమనే సందేశాన్ని వ్యాప్తి చేసేలా ఈ ప్రకటన ఉంది. పోస్టర్‌లో ఒక యువతి రెండు నారింజ పండ్లను పట్టుకుని బస్సులో నిలబడి ఉండగా, పలువురు వృద్ధ మహిళలు ఆమె వైపు చూస్తూ ఉన్నారు. వృద్ధ మహిళల్లో ఒకరు తన వద్ద నారింజ పండ్ల పెట్టెను కలిగి ఉన్నారు. ఇదే మహిళలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

ALSO READ | వాటిని ఆరెంజ్‌లతో పోల్చడమేంటి..? వివాదంలో యువీ ఫౌండేషన్ 

"రొమ్ము" అనే పదాన్ని ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడని మీరు, ఈ సమాజంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై ఎలా అవగాహన పెంచుతారు..? అని మహిళలు ప్రశిస్తున్నారు. అమ్మతనాన్ని పండ్లతో పోలుస్తూ నలుగురిలో చూపెట్టడం ద్వారా యువతలో చెడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. పోస్టర్‌ చూసిన ప్రతిసారి సిగ్గుగా, ఇబ్బందికరంగా ఉంది. మహిళలకు ఇంతకంటే అవమానకరమైనది మరొకటి ఉందా..? అంటూ మహిళలు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు యువరాజ్ సింగ్‌ను ట్యాగ్ చేసి, ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో యాజమాన్యం ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.