మొబైల్ స్కానింగ్ మెషీన్ సీజ్ : డీఎంహెచ్ వో శశికళ

శాంతినగర్, వెలుగు: ఎలాంటి పర్మిషన్​ లేకుండా రూల్స్ కు విరుద్ధంగా గర్భిణులకు స్కానింగ్  చేస్తున్న మొబైల్  స్కానింగ్  మెషీన్​ను సీజ్ చేసినట్లు డీఎంహెచ్ వో శశికళ తెలిపారు. ఆదివారం వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లోని మౌనిక ప్రజా వైద్యశాలలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ గర్భిణులకు స్కానింగ్  చేస్తున్నప్పటికీ ఎలాంటి రిజిస్టర్లు మెయింటేయిన్  చేయడం లేదని, రిజిస్ట్రేషన్  లేకుండానే స్కానింగ్  చేస్తున్నట్లు  గుర్తించారు. పర్మిషన్  లేకుండా స్కానింగ్​ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో వెల్లడైందని డీఎంహెచ్​వో తెలిపారు. 

ఆర్ఎంపీలు రిఫర్​ చేసిన గర్భిణులకు స్కానింగ్  చేస్తున్నారని, ఇలా చేయడం చట్టప్రకారం నేరమన్నారు. మొబైల్  స్కానింగ్  మెషీన్​ను ఒక హాస్పిటల్  నుంచి మరో హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్  చేయడం చట్ట విరుద్ధమన్నారు. మొబైల్  స్కానింగ్  మెషీన్​ను సీజ్  చేసి, పర్మిషన్  లేకుండా హాస్పిటల్  నిర్వహిస్తున్న డాక్టర్​ మురళీకృష్ణ, స్కానింగ్ చేస్తున్న ఝాన్సీరాణిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ కు రిఫర్  చేసినట్లు చెప్పారు. తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ స్రవంతి ఉన్నారు.