- 2020 క్యూ3తో పోలిస్తే 24 శాతం అప్
- మొత్తం ఆదాయం 9,065 కోట్లు
- కొత్తగా 17 స్టోర్ల లాంచ్
ముంబై: డీమార్ట్ పేరుతో సూపర్మార్కెట్ల చెయిన్ నిర్వహించే ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు డిసెంబరు 31, 2021తో ముగిసిన మూడో క్వార్టర్లో నికర లాభం 24.6శాతం పెరిగి రూ. 586 కోట్లకు చేరుకుంది. రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేస్తున్న ఈ రిటైల్ చెయిన్ ఏడాది క్రితం క్యూ3లో రూ. 470 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేసింది. మొత్తం ఆదాయం ఏడాది క్రితం రూ.7,432 కోట్లతో పోలిస్తే 22శాతం పెరిగి రూ.9,065 కోట్లకు చేరుకుంది. తాజా క్యూ3లో 17 కొత్త స్టోర్లను తెరిచినట్టు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 2021--–22 ఆర్థిక సంవత్సరం క్యూ3లో మొత్తం ఖర్చులు రూ. 8,493.55 కోట్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరం మూడో క్వార్టర్లో రూ.6,977.88 కోట్లతో పోలిస్తే ఇవి 21.72శాతం పెరిగాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి తొమ్మిది నెలలలో మొత్తం ఆదాయం రూ. 22,190 కోట్లు. ఇది క్రితం సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రూ. 16,731 కోట్లు. తొమ్మిది నెలల కాలానికి నికర లాభం రూ.1,066 కోట్లు. గత ఏడాది తొమ్మిది నెలల్లో ఇది రూ.686 కోట్లు. పన్నుకు ముందు లాభం (ప్యాట్ మార్జిన్) 4.8శాతం ఉంది. బీఎస్ఈలో శుక్రవారం అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్క్రిప్ 0.5శాతం లాభంతో రూ. 4,730 వద్ద ముగిసింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ &ఎండీ నెవిల్ నోరోన్హా ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఈ క్వార్టర్లో డీమార్ట్ స్టోర్ల ద్వారా ఆదాయం గత సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 22 శాతం పెరిగింది. . నిత్యావసర వస్తువులు బాగా అమ్ముడయ్యాయి. సాధారణ సరుకులు, దుస్తులు వ్యాపారం కొద్దిగా తగ్గింది. ఇన్ఫ్లేషన్తోపాటు బయటికి వెళ్లడానికి జనానికి తక్కువ అవకాశాలు ఉండటంతో అమ్మకాలపై ఎఫెక్ట్ ఉంటోంది. ఇక నుంచి మా అమ్మకాలు స్థానికంగా విధిస్తున్న రిస్ట్రిక్షన్లపై ఆధారపడి ఉంటాయి”అని వివరించారు.
