బాల్య వివాహాలు చట్టవిరుద్ధం

వనపర్తి, వెలుగు: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, బాల్య వివాహాలు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు ఉంటాయని డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజిని తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో బుధవారం గర్ల్స్​​ హాస్టల్​లో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎస్పీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, వరద బాధితులకు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉంటే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. 

త్వరగా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు టోల్​ ఫ్రీ నంబర్​ 15100 కు కాల్​ చేసి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బార్​ అసోసియేషన్​ వైస్​ ప్రెసిడెంట్​ కృష్ణయ్య, సఖి సెంటర్​ నిర్వాహకులు కవిత, పద్మజ పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: బాల్య వివాహాలను నిర్మించాలని జిల్లా జడ్జి రాజేశ్ బాబు సూచించారు. నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు పూర్తిగా నిషేధమన్నారు. చట్ట ప్రకారం పురుషుడికి 21 ఏండ్లు, మహిళలకు 18 ఏండ్లు నిండాకే వివాహం చేయాలన్నారు. 

మైనర్లకు వివాహం చేసుకుంటే రూ. లక్ష జరిమానా, రెండేండ్లు జైలు శిక్ష, రెండు విధించే అవకాశం ఉందన్నారు. ప్రోత్సహించిన పేరెంట్స్​ కూడా శిక్షార్హులేనన్నారు. పెండ్లి తరువాత తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. సివిల్  జడ్జి సబిత, ప్రిన్సిపాల్  లలిత పాల్గొన్నారు.

ఊట్కూర్: మండలంలోని బిజ్వార్  గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, సోషల్  మీడియాతో దుష్ప్రభావంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయవద్దని, బడీడు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. బాల్య వివాహ్  ముక్త్  భారత్ గా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు. శ్రావణ్ కుమార్, భాగ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.