నన్ను రాజకీయంగా అంతం చేసేందుకు కుట్ర : డిప్యూటీ సీఎం శివకుమార్

నన్ను రాజకీయంగా అంతం చేసేందుకు కుట్ర :  డిప్యూటీ  సీఎం శివకుమార్

బెంగళూరు : తనను రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ ఆరోపించారు. అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి డీకే కంపెనీ జైహింద్‌‌ కమ్యూనికేషన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ చానల్‌‌కు సీబీఐ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై డీకే శివకుమార్​ స్పందించారు. సీబీఐ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు తాను సిద్ధమేనని చెప్పారు. తన సంస్థ వద్ద అన్ని పత్రాలు ఉన్నా.. నోటీసులు ఎలా జారీ చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. వాళ్ల దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. 

ఇదంతా తనను ఇబ్బంది పెట్టడానికేనని తనకు తెలుసన్నారు. ‘నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు కొందరు నన్ను జైలుకు పంపుతామని అన్నారు. నాపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో చర్చకు రావాలంటూ వారిని సవాల్​ చేశాను. అయితే, వారు చర్చలకు ముందుకు రాలేదు. రాజకీయంగా నన్ను అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు’ అని ఆయన చెప్పారు. ఈ కేసులో విచారణ దాదాపుగా 90 శాతం పూర్తయిందంటూ  సీబీఐ అధికారులు ప్రకటించడంపైనా డీకే సందేహం వ్యక్తం చేశారు.