ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : డీకే అరుణ

  • పాలమూరు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

మక్తల్, ఊట్కూర్, నర్వ, వెలుగు : పాలమూరులో ఓడిపోతమనే భయంతో కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. గురువారం మక్తల్, ఊట్కూర్, బిజ్వారం, పులిమామిడి, జక్లేర్, మంతన్ గౌడ్, పాతర్ చెడ్, నర్వ, యాంకి గ్రామాల్లో చేపట్టిన రోడ్ షో ఆమె మాట్లాడారు. ఆనాడు జైపాల్ రెడ్డి మొదలు ఇప్పటి సీఎం రేవంత్ వరకు.. తనను, తన కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఆరోజు జైపాల్ రెడ్డి తనకు టికెట్ రాకుండా చేశారన్నారు.  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్​గా గెలిచి కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తీసుకొచ్చానని చెప్పారు. పాలమూరుకు అరుణ ఏం చేసిందని అడిగే వారు ఆనాడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తనను గెలిపిస్తే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పావని, వైస్ చైర్ పర్సన్ అఖిల, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.