వికారాబాద్ కలెక్టర్​పై దాడి విచారకరం : డీకే అరుణ

  • ప్రభుత్వాలు ప్రజాభీష్టం మేరకే నడుచుకోవాలి

వికారాబాద్, వెలుగు: లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ ​జైన్​పై దాడి విచారకరం, బాధాకరమని.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అయితే,  ప్రభుత్వం రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా వారి అభీష్టం మేరకు ఫార్మా కంపెనీని విరమించుకోవాలన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ మూడు గ్రామాల్లో ఉన్న వారంతా ఎస్సీ, ఎస్టీలని, అక్కడున్న రైతులకు ఎకరా, రెండెకరాల భూమి మాత్రమే ఉందని ఎంపీ తెలిపారు.

 అక్కడి రైతులకు చదువు తక్కువగా ఉందని, ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారికి లేదన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయని ప్రభుత్వం.. కొత్తగా ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారని చెప్పారు. అధికారులపై దాడి చేశారని సాధారణ ప్రజలను, రైతులను ప్రభుత్వం హింసించ వద్దని సూచించారు.