పరిహారం ఇచ్చాకే.. ‘ఉదండాపూర్ ’ చేపట్టాలి

  • గత బీఆర్ఎస్ పాలకులతోనే వచ్చిన ఇబ్బందులు
  • హామీ ప్రకారం రూ. 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి

జడ్చర్ల టౌన్, వెలుగు : ఉదండాపూర్​భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పనులను చేపట్టాలని పాలమూరు​ ఎంపీ డీకే అరుణ డిమాండ్​చేశారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్​ఆఫీసులో గురువారం జడ్చర్ల మండలం ఉదండాపూర్​భూ నిర్వాసితులు తమ సమస్యలపై ఎంపీని కలవగా వారిని అడిగి తెలుకుని మాట్లాడారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం ఎనిమిదేండ్ల కిందట భూ సేకరణ చేశారని, ఇంత వరకూ పరిహారం మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు.

భూములు, ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ రైతులు తమకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తారా అంటూ నిలదీశారు. పరిహారం ఇవ్వకుండా రైతులను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రాజెక్టు డీపీఆర్​ను మార్చిందని, జూరాల నుంచి నీళ్లు తీసుకునే స్థలాన్ని మార్చడంతోనే పనులు లేట్ అవుతున్నాయన్నారు.

దీంతో నార్లాపూర్, ఉదండాపూర్ రిజర్వాయర్ల కిందట నిర్వాసితులకు పరిహారం అందలేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.25 లక్షల ప్యాకేజీ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ వద్ద 167 జాతీయ రహదారి  పనులు, పెండింగ్  ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఎంపీ అరుణ పరిశీలించారు. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.