లెజెండ్ ప్లేయర్..ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జొకోవిచ్‌

లెజెండ్ ప్లేయర్..ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జొకోవిచ్‌
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జొకోవిచ్‌
  • ఎనిమిదో టైటిల్‌‌తో లెజెండ్స్‌‌ సరసన చోటు
  • వరల్డ్‌ నంబర్‌‌వన్‌ ర్యాంకూ సొంతం

మెల్‌‌బోర్న్‌‌: సెర్బియా స్టార్‌‌, డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ ఫైనల్లో రెండోసీడ్‌‌ జొకోవిచ్‌‌ 6–4, 4–6, 2–6, 6–3, 6–4తో ఐదోసీడ్‌‌ డోమ్నిక్‌‌ థీమ్‌‌ (ఆస్ర్టియా)పై గెలిచాడు. దీంతో ఎనిమిదో టైటిల్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒకే స్లామ్‌‌ను ఎనిమిది అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో ప్లేయర్‌‌గా జొకో..  రఫెల్‌‌ నడాల్‌‌ (12 ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌), రోజర్‌‌ ఫెడరర్‌‌ (8 వింబుల్డన్‌‌) సరసన చోటు సంపాదించాడు. ఓవరాల్‌‌గా 17 గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్స్‌‌తో ఆల్‌‌టైమ్‌‌ లిస్ట్‌‌లోనూ లెజెండ్స్‌‌కు చేరువగా వచ్చాడు. తాజా విజయంతో జొకోవిచ్‌‌.. ఏటీపీ ర్యాంకింగ్స్‌‌లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకోనున్నాడు. నడాల్‌‌ రెండో ర్యాంక్‌‌కు పడగా, ఫెడరర్‌‌ మూడులోనే కొనసాగనున్నాడు. థీమ్‌‌ కెరీర్‌‌ బెస్ట్‌‌ నాలుగో ర్యాంక్‌‌ దక్కించుకోనున్నాడు. సోమవారం అధికారికంగా ఈ ర్యాంక్‌‌లను ప్రకటించనున్నారు.

హోరాహోరీ..

నాలుగు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో థీమ్‌‌ శక్తికి మించి పోరాడాడు. ఫలితంగా ఫేవరెట్‌‌గా దిగిన జొకో రెండుమూడు సార్లు మెడికల్‌‌ టైమ్‌‌ ఔట్‌‌ తీసుకొని మరీ అతన్ని ఎదుర్కొన్నాడు. గ్రౌండ్‌‌ మొత్తం చిరుతలా పరుగెత్తిన 26 ఏళ్ల థీమ్‌‌.. ప్రతి గేమ్‌‌లోనూ సెర్బియన్‌‌ను కష్టాల్లోకి నెట్టాడు. పదునైన సర్వీస్‌‌, బలమైన గ్రౌండ్‌‌ స్ట్రోక్స్‌‌తో ఆద్యంతం అలరించాడు. ఇక ఆరంభం నుంచి అలుపు లేకుండా పోరాడిన జొకో.. సుదీర్ఘమైన ర్యాలీలతో ఆస్ర్టియా ప్లేయర్‌‌కు పరీక్ష పెట్టాడు. ఫోర్‌‌హ్యాండ్‌‌ షాట్లతో బ్రేక్‌‌ పాయింట్లను కొల్లగొడుతూ మానసికంగా పైచేయి సాధించాడు. రెండో గేమ్‌‌లో థీమ్‌‌ సర్వ్‌‌ బ్రేక్‌‌ చేసినా.. చాలా రేర్‌‌గా డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేసే జొకోవిచ్‌‌.. ఏడో గేమ్‌‌లో సర్వీస్‌‌ చేజార్చుకున్నాడు. చివరకు పదో గేమ్‌‌లో థీమ్‌‌ సర్వ్‌‌కు అడ్డుకట్ట వేసి తొలిసెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండోసెట్‌‌లో కొన్నిసార్లు పేలవ రిటర్న్‌‌ చేసిన జొకో .. మూడు, తొమ్మిదో గేమ్‌‌లో సర్వ్‌‌ను కోల్పోయాడు. మూడోసెట్‌‌లో మరింత రెచ్చిపోయిన థీమ్‌‌.. ఫస్ట్‌‌, మూడో గేమ్‌‌లో జొకోవిచ్‌‌ సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి 3–0 ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరుతో ఎనిమిదో గేమ్‌‌లో నాలుగో సెట్‌‌ పాయింట్‌‌తో విజేతగా నిలిచాడు. నాలుగో గేమ్‌‌లో ప్రతి పాయింట్‌‌ కోసం ఇద్దరు హోరాహోరీగా పోరాడారు. స్కోరు 4–3 వద్ద థీమ్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసిన సెర్బియన్‌‌ 5–3 లీడ్‌‌లోకి వెళ్లాడు. తర్వాతి గేమ్‌‌లో సర్వీస్‌‌ను కాపాడుకుని సెట్‌‌ గెలిచి 2–2తో మ్యాచ్‌‌లో నిలిచాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్‌‌లో తన అనుభవాన్ని రంగరించిన జొకోవిచ్‌‌.. మూడో గేమ్‌‌లో బ్రేక్‌‌ పాయింట్‌‌ను కాచుకుని థీమ్‌‌ సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి 2–1తో లీడ్‌‌లోకి వెళ్లాడు.  తర్వాతి గేమ్‌‌లు సుదీర్ఘంగా సాగినా.. ఇద్దరూ సర్వ్‌‌లు కాపాడుకున్నారు. చివరకు 5–4 లీడ్‌‌ వద్ద జొకోవిచ్‌‌ అద్భుతమైన ఏస్‌‌లు కొడుతూ మ్యాచ్‌‌ పాయింట్‌‌తో సర్వీస్‌‌ను కాపాడుకుని టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు.