న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారుచేసే డిక్సన్ టెక్నాలజీస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీము కింద లాభాలు పొందనుంది. ఇండియాకు చెందిన ఈ కాంట్రాక్టు మానుఫ్యాక్చరర్ స్మార్ట్ఫోన్ల తయారీకి పీఎల్ఐకి కింద ఇన్సెంటివ్‌లు పొందిన మొదటి కంపెనీ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2021 అక్టోబరు–డిసెంబరు క్వార్టర్‌కు కంపెనీ దాదాపు రూ. 53 కోట్లను ఇంక్రిమెంటల్ సేల్స్‌పై రాయితీగా పొందడానికి అర్హత సాధించింది. ఇన్సెంటివ్ మొత్తాన్ని రానున్న కొద్ది రోజుల్లో కంపెనీకి అందజేయనున్నారు.
కంపెనీ ఇప్పటి వరకు అక్టోబర్ క్వార్టర్‌కు మాత్రమే ఇన్సెంటివ్‌లను క్లెయిమ్ చేసింది. తమ కేసును ఎంపవర్డ్ గ్రూపు ఆమోదించిందని, తమ సబ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని డిక్సన్ టెక్నాలజీస్ సీఎండీ సునీల్ వచాని చెప్పారు. కంపెనీ సబ్మిషన్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ గ్రూపు సెప్టెంబర్ 9న సమావేశం అయింది. పీఎల్ఐ ఇన్సెంటివ్స్ కోసం డిక్సన్ టెక్నాలజీస్, శామ్‌సంగ్ కూడా డాక్యుమెంట్లను సమర్పించాయి. యాపిల్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్‌కాన్, విస్ట్రన్ సైతం ఇన్సెంటివ్‌లను పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. డిక్సన్ దేశీయ తయారీ సంస్థ అయినందున స్మార్ట్‌ఫోన్ పీఎల్ఐ స్కీమ్‌కు అర్హత సాధించడానికి రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. మొదటి సంవత్సరంలో రూ. 500 కోట్ల విలువైన ఫోన్‌లను తయారు చేసింది.
