కర్నూల్ జిల్లా: తేనెటీగల దాడిలో డివిజినల్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన మంగళవారం కర్నూల్ జిల్లాలో జరిగింది. పాములపాడు మండలం, బానకచర్ల క్రాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా తేనెటీగలు దాడి చేయడంతో ఎస్ఆర్బీసీ డీఈ భానుప్రకాశ్ మృతి చెందారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎస్‌ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీగా ఏడుస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
విధి నిర్వహణలో ఉన్న డీఈ భానుప్రకాష్ తేనెటీగలు కుట్టి మృతి చెందడం చాలా దురదృష్టకరం అని.. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్. అధికారులు క్షేత్ర పర్యటనలకు వెళ్ళినపుడు చుట్టుపక్కల గమనిస్తూ జాగ్రత్తగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
