లోకల్​బాడీ ఎన్నికలకు రెడీ కావాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు ​

  • ఇక కార్యకర్తలతో గ్రామస్థాయి మీటింగ్​లు
  • ఓపికతో ఉంటే పదవులు అవే వస్తాయి 
  • బీజేపీ, బీఆర్ఎస్​ దుష్ప్రచారాలు తిప్పికొట్టాలె

నిజామాబాద్/ కామారెడ్డి​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్​ కార్యకర్తలంతా రెడీ కావాలని జిల్లా ఇన్​చార్జ్​ మినిస్టర్​ జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన సైనికులకు పదవులు లభించే టైం వచ్చిందన్నారు. మంగళవారం డిచ్​పల్లిలో నిర్వహించిన పార్లమెంట్​ సెగ్మెంట్​ లెవెల్​ మీటింగ్​లో ఆయన ప్రసంగించారు. కార్యకర్తలకు ఓటర్లతో దగ్గరి సంబంధాలుంటాయని, ఎన్నికలేవైనా ఓట్లు వేయించేది వారేనన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి జిల్లాలో బీఆర్​ఎస్​ సోషల్​ మీడియాపై నెలకు రూ.కోటి ఖర్చుపెట్టినా ప్రజలు తిరస్కరించారన్నారు. వచ్చే లోకల్​బాడీ ఎలక్షన్​లో కాంగ్రెస్​ క్యాడర్​ యాక్టివ్​గా పనిచేయాలని బూత్​ లెవెల్​లో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ప్రతి వంద ఓటర్లకు ఒకరిని ఇన్చార్జిగానియమించామని, వారు రోజుకు నాలుగు కుటుంబాలను కలిసి ప్రభుత్వ స్కీంలను వివరించాలన్నారు. 

ప్రతి సెగ్మెంట్​కు రూ.170 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వబోతున్నామని, భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందబోతున్నామని, వీటి గురించి ప్రజలకు వివరించాలన్నారు. కులమతాలను రెచ్చగొట్టి పబ్బంగడిపే బీజేపీతో కలిగే నష్టాలను చెప్పాలన్నారు. వచ్చే మూడు నెలలు జిల్లాలోని ప్రతి సెగ్మెంట్​లోని మండలం, గ్రామాల వారీగా రెగ్యూలర్​ మీటింగ్​లు నిర్వహిస్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ పట్టింపులకు పోవద్దని, వివాదాలుంటే కూర్చొని పరిష్కరించుకుందామన్నారు. కార్యకర్తలకు లోకల్​ బాడీ ఎన్నికలలో లభించే పదవులతో పాటు కార్పొరేషన్​పదవులు ఇస్తామన్నారు. 

కార్యకర్తలే కాంగ్రెస్​కు బలమని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. కుటుంబంలో సభ్యుల మాదిరి తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకునే చాన్స్​ మళ్లీ వచ్చిందన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, జడ్పీ ఇతర పదవులన్నీ కాంగ్రెస్​ ఖాతాలో వేసేందు కలిసికట్టుగా పని చేద్దామన్నారు. బీఆర్​ఎస్​ సర్కారు చేసిన అప్పుల భారం కాంగ్రెస్​ గవర్నమెంట్​కు ఇబ్బందిగా మారిందని రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి అన్నారు. కొన్ని హామీల అమలు ఆలస్యం కావడానికి అదే కారణమనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తాహెర్​, అన్వేష్​రెడ్డి, మానాల మోహన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.

 సేవ చేయడానికే పదవులు

 పదవులను అలకారప్రాయం కాకూడదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి మార్కెట్​ కమిటీ పాలకవర్గం మంగళవారం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్కెట్​ ఆదాయం పెంచాలని, రైతుల ఇబ్బందులు తీర్చాలని అన్నారు. పాలకవర్గం ముల్కనూరు సోసైటీని సందర్శించి అక్కడి కార్యక్రమాలు చూడాలని సూచించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పిన కేసీఆర్​ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, సర్పంచులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.40వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో పెట్టారన్నారు. 

తమ చేతికి చిప్ప ఇచ్చి పోయి ఇప్పుడు మళ్లీ అది చేయట్లేదు.. ఇది చేయట్లేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. 10 ఏండ్లలో కేసీఆర్​ ఒక్క రోజు కూడా అంబేద్కర్​ విగ్రహానికి పూల దండ వేయలేదని, తెలంగాణ ఇచ్చిన మాజీ పీఎం మన్మోహన్​సింగ్​ చనిపోతే కనీసం నివాళి అర్పించలేదన్నారు. కామారెడ్డి పెద్ద చెరువును టూరిస్ట్​ స్పాట్​గా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తానని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆట, పాటలు నేర్చుకునేందుకు హాల్​ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, జహీరాబాద్​ ఎంపీ సురేశ్​షేట్కార్, మున్సిపల్​ చైర్​పర్సన్​ ఇందుప్రియ పాల్గొన్నారు.