అభివృద్ధిలో ఆదర్శంగా ఆదిలాబాద్ : సీతక్క

  • రూ. 10.53 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క 
  • రిమ్స్ లో మహిళా శక్తి క్యాంటీన్, ట్రాన్స్‌ జెండర్ క్లినిక్ భవనం ప్రారంభం
  • మావలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
  • పెండింగ్ లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ 

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  ఆదిలాబాద్​ జిల్లాను అభివృద్ధి పనులతో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో ఆమె వివిధ డెవలప్ మెంట్ పనులు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  సీతక్క మాట్లాడుతూ..  మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని సీతక్క అన్నారు. 

అదే లక్ష్యంతో ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా సీఎం మహిళలకు 12 రకాల ఉపాధి అవకాశాలు కల్పించారని  వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక పథకాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  ఈ సందర్భంగా 1550 మంది మహిళా సమైక్య సభ్యులకు రూ.102 కోట్ల చెక్కును అందజేశారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని  తెలిపారు. సీఈఐఆర్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న 20 మొబైల్ ఫోన్ లను మంత్రి బాధితులకు తిరిగి అందజేశారు.

వివిధ పనులకు శంకుస్థాపన 

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్, ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలతో కలిసి స్థానిక రిమ్స్ లో  మహిళా శక్తి ఆధ్వర్యంలో మహిళా క్యాంటీన్​ను, ట్రాన్స్​జెండర్​ల క్లినిక్​ను,  కైలాస్​ నగర్‌‌లో కమాండ్​ కంట్రోల్​ రూమ్, మహిళా వికాస జిల్లా సమైఖ్య నూతన భవనాన్ని మంత్రి సీతక్క  ప్రారంభించారు. 

అనంతరం పట్టణంలో రూ.10.53 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మావల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో​ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో పెండింగ్​లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.  

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్లను నియమించాలి 

ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ..  అభివృద్ధి పనులు సత్వరంగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్ర మోదీ రూ.150 కోట్లతో మంజూరు చేసిన సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని పేదలకు ఎక్కువ మొత్తంలో ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

అనంతరం స్థానిక కొమురం భీం కాలనీ వాసులు ఇళ్ల పట్టాలు అందజేసి, విద్యుత్​ సౌకర్యం కల్పించాలని మంత్రి సీతక్క కి వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంత్రి బైక్​ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ గౌష్​ ఆలం, అడిషనల్​ కలెక్టర్​ శ్యామలా దేవి,  అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.