ఇష్టంతో కష్టపడి చదవాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్టూడెంట్​దశ నుంచే ఇష్టంతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని కలెక్టర్​క్రాంతి సూచించారు. గురువారం సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్​లో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024 –25 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్స్​గణితం, సైన్స్ ను మార్కుల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదవాలని ఆ పట్టుదలే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు.

జిల్లావ్యాప్తంగా వివిధ స్కూళ్లకు చెందిన 850 ఎగ్జిబిట్స్ ప్రదర్శనకు వచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. వీటిలో 30 ఎగ్జిబిట్స్​ని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శాంతి కుమారి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సభ్యుడు సుబ్రతో, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింభాజీ, ఎంఈవో విద్యాసాగర్, భాస్కర్, సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సాల్మన్ రెడ్డి పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు స్పీడప్​చేయాలి

జిన్నారం: జిల్లాలో ధాన్యం కొనుగోలు స్పీడప్​చేయాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. గురువారం జిన్నారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 48 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు ఆదేశించారు. కొనుగోళ్ల రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, సన్నధాన్యానికి సంబంధించిన బోనస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిన్నారంలో జరుగుతున్న సమగ్ర సర్వేను పరిశీలించారు.

ఎన్యూమరేటర్లతో మాట్లాడి సర్వే వివరాలు తెలుసుకున్నారు. సర్వే పై ప్రజలు అపోహలు పెట్టుకోకుండా అడిగిన ప్రతి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా పౌరసరఫరాల శాఖ జీఎం కొండల్ రావు, అడిషనల్​డీఆర్డీవో జంగారెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో అరుణారెడ్డి పాల్గొన్నారు.