టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి

  • ఉపాధ్యాయులకు పోస్టింగ్
  • చిత్తశుద్ధితో బోధన చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో డీఎస్సీ 2024లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పోస్టింగ్ ఆర్డర్లు అంద జేశారు. డీఎస్సీ కమిటీలో చైర్మన్ గా  జిల్లా కలెక్టర్, మెంబర్లుగా అడిషనల్  కలెక్టర్(రెవెన్యూ) డీఈవో తదితరులు ఉన్నారు. 

మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఆప్షన్ తీసుకొని 196 మందికి పోస్టింగ్ లు అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతు ఎంపికైన ఉపాధ్యాయులు క్రమ శిక్షణ,చిత్త శుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు , జడ్పీ సీఈవో వెంకట రెడ్డి, డీఈవో రవీందర్ పాల్గొన్నారు. 

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో కొత్తగా ప్రభుత్వ టీచర్లుగా నియామకమైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన టీచర్ల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు.  ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న  అభ్యర్థులు కేటాయించిన స్కూళ్ల లో  బుధవారం విధులకు కచ్చితంగా హాజరు కావాలన్నారు.  జిల్లా ఆడిషనల్ కలెక్టర్  నర్సింగారావు, జడ్పీ సీఈఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  డీఎస్సీ-2024 ద్వారా జిల్లాలో ఎంపికైన 210 మంది నూతన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో పాఠశాలల కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు పాఠశాలల కేటాయింపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను, పాఠశాలలు ఉపాధ్యాయ ఖాళీల వివరాలను డీఈఓ గోవిందరాజులు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఈవో  గోవిందరాజులు,  తదితరులు పాల్గొన్నారు.