గ్రూప్ –3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : క్రాంతి వల్లూరు

  • సంగారెడ్డి  జిల్లాలో 49  కేంద్రాల్లో పరీక్ష 
  • హాజరకానున్న అభ్యర్థులు 15,123 
  • కలెక్టర్  క్రాంతి వల్లూరు

సంగారెడ్డి టౌన్ , వెలుగు: టీజీపీఎస్సీ గ్రూప్ –-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం టీజీపీఎస్సీ గ్రూప్-–3 ఎగ్జామ్స్ నిర్వహణపై  మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ..   ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష  ఉంటుందన్నారు.  పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారని పేర్కొన్నారు. 

సాయంత్రం 3.00 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష పరీక్షా కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30  గంటలకు మూసివేస్తారని తెలిపారు. 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుందన్నారు.  సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్– 3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 49  కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , అదనపు ఎస్పీ సంజీవరావు, జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్,   తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు.  బుధవారం సంగారెడ్డి జిల్లా అత్నూరు మండలం చందాపూర్ పల్పనూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు  వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయాలని త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 ప్రజలు సర్వేకు సహకరించాలి : కలెక్టర్

సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలంలోని చందాపూర్ పల్పనూరు గ్రామాల్లో సమగ్ర సర్వేను వల్లూరి క్రాంతి పరిశీలించారు. సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని పూర్తి సమాచారం అందించాలన్నారు. సమాచారం గోప్యంగా ఉంటుందని కలెక్టర్ క్రాంతి తెలిపారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈవో స్వప్న, తహసీల్దార్ ఫర్విన్ షేక్, ఎంపీడీవో శంకర్, ఎన్యురేటర్లు పాల్గొన్నారు.