తెలంగాణ లీడర్లపై తిరుపతిలో వివక్ష : మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ 

గద్వాల, వెలుగు: ఏపీలోని తిరుపతిలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు, లీడర్లపై వివక్ష చూపిస్తున్నారని మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని మాజీ మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమంతు నాయుడు ఇంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గతంలో తిరుమల దర్శనాల విషయంలో ఎలాంటి తేడా లేకుండా సిఫారసు లెటర్లు, లీడర్లకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు.

కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తూ వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతిగా ఆయన అభివర్ణించారు. గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను టీటీడీ పునరుద్ధరించాలని, తెలంగాణ లీడర్ల సిఫారసు లేఖలను అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.