ఉద్యోగాల భర్తీని జీర్ణించుకోలేని బీఆర్​ఎస్​కు ఆశాభంగం

గ్రూప్​ పరీక్షల నిర్వహణలో ఫెయిల్​ అయిన బీఆర్​ఎస్​కు.. అవే గ్రూప్​ పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూ  రేవంత్​సర్కార్ ఆ పార్టీని బోనులో నిలబెట్టింది.​ డీఎస్సీ నిర్వహించి, 56 రోజుల్లో  ఫలితాలు విడుదల చేసి, 11 వేల మందికి పైగా  ఉద్యోగాలు సీఎం రేవంత్ ఇవ్వడం సహజంగా బీఆర్ఎస్ జీర్ణించుకోలేని వ్యవహారం. ఇక గ్రూప్ 1 సహా  ఇతర గ్రూప్  పరీక్షలు  సైతం  నిర్వహించాలని  ప్రభుత్వం  నిర్ణయించింది.   నిరుద్యోగుల్లో,  విద్యార్థి,  యువజనుల్లో  రేవంత్ రెడ్డి  గ్రాఫ్  పెరుగుతుందన్న ఆందోళనతో  బీఆర్ఎస్  గ్రూప్ 1 పరీక్షలు  వాయిదా  వెయ్యాలని డిమాండ్  చేస్తోంది.  సుప్రీంకోర్టులోనూ తమ న్యాయవాదులను పెట్టి పోరాటానికి  లక్షలాది  రూపాయలు  నీళ్లలా ఖర్చు పెట్టింది. అయినా,  సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పునే సమర్థించింది.  తెలంగాణ  ప్రభుత్వ  న్యాయపోరాటమే  గెలిచింది.  

గ్రూప్​‌‌–1పరీక్షల నిర్వహణలో  జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు స్పష్టతతో గ్రూప్​–1 పరీక్షలకు లైన్​ క్లియర్​ అయింది. పరీక్షలు మొదలయ్యాయి.

నిరుద్యోగుల సమస్య పట్ల  బీఆర్ఎస్  అతిగా  స్పందిస్తోంది.  ఆ పార్టీ  ఉద్యమాలు 'కల్పితం' గా, 'కృతకంగా'  కనిపిస్తున్నట్టు  విశ్లేషకులు అంటున్నారు. తాము  అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిరుద్యోగికి  అయినా 'తెలంగాణోద్ధారకులు'గా  భజన  చేసుకునే  బీఆర్ఎస్ నాయకులు  అపాయింట్ మెంట్ ఇచ్చారా?  కనీసం  ఫోన్ 
కాల్​కు  స్పందించిన వారున్నారా? అలాంటప్పుడు  నిరుద్యోగుల  గురించి  మాట్లాడే   నైతిక హక్కు  
బీఆర్ఎస్​కు ఎక్కడిది?  నిరుద్యోగులను, సాధారణ  ప్రజల్ని   బీఆర్ఎస్ పాలకులు 'పురుగుల' కంటే   హీనంగా చూశారన్న అపవాదు  ఆ పార్టీపై  ఉన్నది.

నిరుద్యోగులు ఇప్పటికీ బీఆర్​ఎస్​ను విశ్వసించడంలేదు

 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  నిరుద్యోగ  యువతతో  జరిపిన  ఒక 'షో'లో  కేటీఆర్  ఓ నిరుద్యోగిపై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గమనిద్దాం. ‘సందీప్..  మీకున్న  ఎకరం  పొలానికిగాను,  రైతుబంధు ఏడాదికి  రూ.10 వేలు వస్తున్నాయి.  రైతుబీమా వస్తోంది .ఉచిత  కరెంటు ఇస్తున్నాం.  ఇంకా  పలు సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి.  

మన దేశం కుటుంబ వ్యవస్థ  గురించి మీకు తెలుసు. మీ తండ్రికి  ఇన్ని  రకాల  సదుపాయాలు  లభిస్తున్నప్పుడు  అవి  మొత్తం  కుటుంబ  ప్రయోజనాలు  కాపాడినట్టు  కాదా?’  అన్న కేటీఆర్​ వ్యాఖ్యల వీడియోలు  ఇప్పటికీ  అందుబాటులో ఉన్నాయి.  ఆయన వ్యాఖ్యల్ని బట్టి  నిరుద్యోగ  సమస్య పట్ల  బీఆర్ఎస్ వైఖరి,  చిత్తశుద్ధిని అర్థం  చేసుకోవచ్చు.  తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో..  నిరుద్యోగుల 'హెడ్ క్వార్టర్' అశోక్ నగర్ కు ఈ 'ఆధునిక రాజకీయ నాయకుడు' ఎప్పుడూ  వెళ్లిన దాఖలాలు లేవు. ఇపుడు అదే  బీఆర్​ఎస్​ నేతలు​  అశోక్​నగర్​కు వెళితే, ‘​ గోబ్యాక్’​ అంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు.

అధికార లేమి ఒక అరుదైన రోగం

చదుకున్నవారికి  ఉద్యోగాలు  రాకపోతే  వారి బాధ వర్ణనాతీతం.  అయితే,  అధికారం,  పదవులు లేని రాజకీయ 'నిరుద్యోగుల' బాధ  కూడా  అంతా ఇంతా కాదు.  అధికార లేమి అన్నది  ఒక  అరుదైన రోగం.  మరలా అధికార కుర్చీలో  కూర్చుంటే  తప్ప ఆ రోగం  నయం కాదు.  అధికారానికి  దూరమైనవాళ్ళు  తక్షణం  అధికారంలోకి   రావాలనుకోవడం  అత్యాశే కాదు, దురాశ కూడా.  మరో  నాలుగేండ్ల అనంతరం ఎన్నికలు  వచ్చేవరకు ప్రజాతీర్పు శిరసావహించాలని,  అధికారం అసాధ్యమని తెలిసి  కూడా  బీఆర్ఎస్  చేస్తున్న   ప్రకటనలు,  ర్యాలీలు,   ఉద్యమాల వల్ల ఆ పార్టీ  ప్రజల్లో  అభాసుపాలవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

పదేండ్లుగా గ్రూప్​–1 పరీక్ష వాయిదాకు కారకులెవరు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  తర్వాత  ఏడేండ్లకు తొలి గ్రూప్ 1 ప్రిలిమినరీ  పరీక్షకు 2,33,248 మంది  హాజరయ్యారు.   గ్రూప్  1  ద్వారా  503 పోస్టులు  భర్తీ  చేయనున్నట్లు  తెలంగాణ  స్టేట్ సర్వీస్ పబ్లిక్  కమిషన్  ప్రకటించింది.  కానీ,  పరీక్ష  పేపర్  లీకేజీ  కారణంగా  గ్రూప్ - 1ను  రద్దు చేస్తూ  2021లో   కమిషన్  నిర్ణయం  తీసుకుంది.  తర్వాత 2022 జూన్ 11న  మరోసారి  గ్రూప్ - 1 పరీక్ష నిర్వహించింది.  బయోమెట్రిక్ అటెండెన్స్  తీసుకోలేదన్న  వివాదంతో   ఆ పరీక్షను  రద్దు  చేశారు.  గ్రూప్ - 2 పరీక్షకు  మొదట 2016లో  నోటిఫికేషన్ రాగా,  2022  డిసెంబర్‌‌లో   టీఎస్‌‌పీఎస్సీ  గ్రూప్ - 2   నోటిఫికేషన్‌‌ను  విడుదల  చేసింది.   మొత్తం 783 పోస్టులకు 5,51,943  మంది  దరఖాస్తు  చేసుకున్నారు. 2023  ఆగస్టు  29, 30 తేదీల్లో  పరీక్ష జరగలేదు. కొన్ని కారణాలతో  నవంబరుకు  టీజీపీఎస్సీ వాయిదా వేసింది. 

నిరుద్యోగుల బాధ  వర్ణనాతీతం

‘ఇంటికాడి నుంచి ఇస్తున్న పైసలతోనే జీవితం గడపాల్సి వస్తోంది. ఇంటికి ఫోన్ చేసిన ప్రతిసారి అరె ఎప్పుడొస్తది  జాబ్.. ఎప్పుడొస్తది జాబ్ అని అడుగుతున్నారు.  మేం  ఏమీ  చెప్పలేకపోతున్నాం.   ఇంటి వద్ద నుంచి డబ్బులు నెలల తరబడి  అడిగి తీసుకోవాలంటే  చాలా బా‌‌‍ధగా  ఉంటోంది.  గ్రూప్ 1 మొదటిసారి  రాసినప్పుడు  క్వాలిఫై అయినా  దాన్ని  రద్దు చేశారు.   మళ్లీ రాసినప్పుడు  కూడా  మంచి  మార్కులు  వస్తాయనుకున్నాం.  కానీ,  దాన్నీ రద్దు చేశారు.  మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు'  అని అశోక్​నగర్​లో  పరీక్షలకు  తయారవుతున్న  నిరుద్యోగులంతా  చెప్పే సారాంశం ఇది.   

తెలంగాణలో  ప్రశ్నపత్రాల లీకులు,  పరీక్షల  వాయిదాలతో  2014 నుంచే  నిరుద్యోగులు  రగిలిపోతున్నారు. 2023  ఎన్నికల  నోటిఫికేషన్‌‌  సాకుతో  పరీక్షలు  మళ్లీ   వాయిదాపడ్డాయి.  నవంబరులో  జరగవలసిన  డీఎస్సీని  కూడా  కేసీఆర్  ప్రభుత్వం వాయిదా వేసింది.  నిరుద్యోగ యువత నిరా‌‌‍శ, నిస్పృహలకు గురవడానికి,  ఉద్యోగ నియామకాల విషయంలో  నాటి  ప్రభుత్వ  విధానాలే కారణం.  పరీక్షల రద్దు,  
వాయిదాలతో  విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోయారు.  

ప్రవళిక ఆత్మహత్యపై  కేటీఆర్​ అనుచిత వ్యాఖ్యలు

వరంగల్ జిల్లాకు చెందిన మర్రి ప్రవళిక అనే యువతి ఆత్మహత్య  చేసుకోవడం  సంచలనం  కలిగించింది.  హైదరాబాద్  అశోక్​నగర్‌‌‌‌లో  హాస్టల్‌‌లో  ఆమె  చనిపోయింది.   గ్రూప్ 1 రద్దు కావడం,  గ్రూప్ 2 వాయిదా  పడటంతో  డిప్రెషన్‌‌లోకి వెళ్లి  ఆత్మహత్య  చేసుకుంది.  వారిపై  పోలీసులు  లాఠీఛార్జి చేసి,  ప్రవళిక  మృతదే‌‌‍హాన్ని  స్వగ్రామానికి తరలించారు.  ప్రవళిక ఆత్మహత్యపై,   నాటి మంత్రి కేటీఆర్  'చౌకబారు'గా  చేసిన  వ్యాఖ్యలపై సోషల్  మీడియాలో  నిరుద్యోగులు,  యువత  తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రవళిక గ్రూప్ -1,  2,  3 పరీక్షలకు  చేసిన  దరఖాస్తులను  సోషల్ మీడియాలో   పోస్టు‌‌లు  వచ్చాయి.  2014 నుంచి  లేక లేక వచ్చిన  గ్రూప్ వన్  నోటిఫికేషన్  రెండుసార్లు రద్దు చేశారు.  పోటీ పరీక్షలపై  నిరుద్యోగుల నమ్మకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేసింది. ఇపుడు రేవంత్​ ప్రభుత్వం చేపట్టిన గ్రూప్​–1 పరీక్షలను వాయిదా వేయాలని ప్రయత్నం చేయడం సిగ్గుపడాల్సిన విషయం.

కొలువుల కోసం కొట్లాట

పరీక్షల వాయిదాలు, ప్రశ్నపత్రాల లీకులు వంటి ఘటనలతో గత  ప్రభుత్వం  ప్రజల్లో  విశ్వాసం  కోల్పోయింది.  ఇప్పటికే  గ్రూప్​ 1 పరీక్ష  రెండుసార్లు  వాయిదా  వేశారు.  మూడోసారి వాయిదా వేస్తే  వ్యవస్థపై  నమ్మకం పోతుంది. మెయిన్స్ పరీక్షకు  ఏర్పాట్లన్నీ  పూర్తయినందున  వాయిదాకు ఆదేశాలివ్వలేం. పైగా తీవ్ర నిరాశానిస్పృహలతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే ఘటనలు పెరిగే ప్రమాదం ఉంది  అని మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ అక్టోబర్ 18 న  ఆదేశాలిచ్చింది.  ఇపుడు సుప్రీం కోర్టు కూడా పరీక్షలను ఆపలేమని చెప్పింది. ప్రతిపక్షంగా మారాక కూడా బీఆర్​ఎస్,​ ఇంకా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, పరీక్షలను వాయిదా వేయించాలని చూడటం  దాని దాష్టీక రాజకీయాన్ని తెలుపుతోంది.

- ఎస్.కే జకీర్,
సీనియర్ జర్నలిస్ట్