స్కూళ్లలో టీచర్స్, స్టూడెంట్స్​ కమిటీలు వేస్తాం : వెంకట నరసింహారెడ్డి

  • స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్  వెంకట నరసింహారెడ్డి

మాగనూర్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించేందుకు టీచర్స్, స్టూడెంట్స్​ కమిటీలు వేస్తామని స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్  వెంకట నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్  సిక్తా పట్నాయక్ తో కలిసి మాగనూర్ జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. స్కూల్​లో వారం రోజుల్లో మూడు సార్లు ఫుడ్  పాయిజన్  కావడంతో బియ్యం స్టాక్, వంట గది పరిసరాలను తనిఖీ చేశారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా స్టాండర్డ్  ఆపరేటింగ్  కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 స్కూల్స్ లోని​టీచర్స్, స్టూడెంట్స్  కమిటీలు వంట చేయక ముందే అన్ని సరుకులను పరిశీలించాలన్నారు. వంట పూర్తయిన తరువాత వాటిని రుచి చూడాలని సూచించారు. ఈ ఘటనతో పేరెంట్స్​ మనస్థైర్యం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారికి మనోధైర్యం కల్పించినట్లు తెలిపారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..

ఫుడ్  పాయిజన్  ఘటనతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కలెక్టర్  సిక్తా పట్నాయక్  తెలిపారు. స్టోర్ రూమ్​ను పరిశీలించి తాజాగా ఉన్న వస్తువులతో విద్యార్థులకు వంట చేపించి భోజనం పెట్టామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 400 మంది విద్యార్థులతో పాటు తహసీల్దార్, టీచర్స్, మీడియా ప్రతినిధులు భోజనం చేశారన్నారు. విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షల కోసం మెడికల్  క్యాంప్  ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి డైరెక్టర్, కలెక్టర్, ఎస్పీ యోగేశ్​ గౌతమ్  మధ్యాహ్న భోజనం చేశారు. ఇదిలాఉంటే పాఠశాల సందర్శనకు వెళ్తున్న పీడీఎస్ యూ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాలు, బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.