జన్​ధన్​ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్లు పెరిగినయ్

జన్​ధన్​ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్లు పెరిగినయ్

 న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఈక్విటీ, లోన్లు​ వంటి ఆర్థిక సేవలు అందరికీ అందితేనే (ఫైనాన్షియల్​ఇన్​క్లూజన్​) సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమ్మిళిత వృద్ధి (ఇన్​క్లూజన్‌ గ్రోత్) ఫలాలు అందాలని స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)   ఆగస్టు 28, 2014 నుంచి మొదలయిందని, 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను తెరవడం జరిగిందని చెప్పారు. వీటిలో రూ. 1.74 లక్షల కోట్ల డిపాజిట్ బ్యాలెన్స్‌‌‌‌ ఉందని వెల్లడించారు. వీరిలో 56 శాతం మంది మహిళలు జన్ ధన్ ఖాతాదారులని అన్నారు. ఈ ఫ్లాగ్‌‌షిప్ ఫైనాన్షియల్ ఇన్‌‌క్లూజన్ స్కీమ్ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలు చెప్పారు. "జన్​ధన్​ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్‌‌ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్​ చేశాం.

ప్రతి కుటుంబమే కాదు ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​ ఫలాలు అందాయి" అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​, లోన్​ సేవలను అందించడానికి పీఎంజేడీవైని అందుబాటులోకి తెచ్చారు.  అర్హులైన లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద  డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్ ​ద్వారా డబ్బును జమ చేస్తున్నామని నిర్మల అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పిఎం- కిసాన్ కింద రైతులకు డబ్బు పంపామని, పిఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద మహిళా పీఎంజేడీవై ఖాతాదారులకు ఎక్స్‌‌గ్రేషియా చెల్లించామని చెప్పారు.  తాజా లెక్కల ప్రకారం మొత్తం 46.25 కోట్ల పీఎంజేడీవై ఖాతాల్లో 37.57 కోట్లు (81.2 శాతం) పనిచేస్తున్నాయి. కేవలం 8.2 శాతం పీఎంజేడీవై ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు కాగా, ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ రూ.3,761. అర్హత కలిగిన పీఎంజేడీవై ఖాతాదారులను ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై),  ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్​బీవై) ఫలాలను అందిస్తారు.