గ్యాప్ ఏర్పడిందని టాక్ వచ్చింది కానీ.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్కు, తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడిందని టాక్ వచ్చిందని, కానీ అలా లేదని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చెప్పారు. డీజీపీతో కూడా మాట్లాడామని, వారు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి తమకు సహకరిస్తామని సీఎం స్పష్టం చేశారని ఎఫ్డీసీ చైర్మన్ మీడియాకు వెల్లడించారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను పాన్ వరల్డ్ లెవల్కు తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు దిల్ రాజు మీడియాకు తెలిపారు. 

హైదరాబాద్ సిటీలో హాలీవుడ్ సినిమాల షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరినట్లు చెప్పారు. దీనికి హీరోలు, హీరోయిన్స్ సహకరిస్తారని సీఎంకు సినీ ఇండస్ట్రీ తరపున హామీ ఇచ్చామని దిల్ రాజు వెల్లడించారు. సీఎం విజన్ తమకు చెప్పారని, ఇండియా లెవల్లో తెలుగు సినిమాకు గౌరవం అందుతుందని దిల్ రాజు గుర్తుచేశారు. FDC అధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించామని, తన ద్వారా కమ్యూనికేట్ చేయమని సీఎం చెప్పారని పేర్కొన్నారు.

Also Read :- సినిమా టికెట్లపై సెస్సు.. రేట్ల పెంపు కూడా లేదు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూం బిల్డింగ్లో ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చలు జరిగాయి. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాలు.. అసెంబ్లీలో ఆ ఘటనపై సీఎం రేవంత్ స్పందించడం, వివరణ ఇస్తూ అల్లు అర్జు్న్ ప్రెస్ మీట్ నిర్వహించడం.. ఈ పరిణామాల తర్వాత జరిగిన సమావేశం కావడంతో సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ హాట్ టాపిక్ అయింది.