కేటీఆర్కు దిల్ రాజు కౌంటర్.. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు

  • కేటీఆర్​ను కోరినఎఫ్​డీసీ చైర్మన్ దిల్​రాజు
  • సంధ్య థియేటర్ ఘటనలోసెటిల్​మెంట్ కామెంట్లు బాధాకారం
  • సీఎంతో మీటింగ్ రహస్యంగా జరగలేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ ప్రముఖుల మీటింగ్ చాటుమాటుగా జరగలేదని ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎఫ్​డీసీ) చైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దని కేటీఆర్​ను ఆయన కోరారు. తమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దని ట్వీట్​లో పేర్కొన్నారు. ‘‘రాజకీయ దాడులు, ప్రతి దాడులకు సినిమా ఇండస్ట్రీని ఉపయోగించుకోకండి. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ మీటింగ్ తర్వాత రహస్య ఒప్పందం జరిగిందనడం కరెక్ట్ కాదు. సంధ్య థియేటర్ ఘటనపై సెటిల్​మెంట్ అయి ఉండొచ్చని కేటీఆర్ అన్నరు. ఆయన చేసిన కామెంట్లలో నిజం లేదు. కేటీఆర్ అలాంటి కామెంట్లు చేయడం బాధాకరం. సీఎం రేవంత్​తో మేమంతా చాటుమాటున కలవలేదు.

 మీటింగ్ గురించి అందరికీ తెలుసు. తెలుగు సినీ ఇండస్ట్రీ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాల్లేకుండా ఈ భేటీ జరిగింది. రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్​పై చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉన్నది. స్టేట్ డెవలప్​మెంట్ జర్నీలో తెలుగు సినీ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని సీఎం గుర్తించారు. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందించాలని రేవంత్ ఆకాంక్షించారు’’అని దిల్ రాజు పేర్కొన్నారు. హైదరాబాద్​ను గ్లోబల్ ఎంటర్​టైన్​మెంట్ హబ్​గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నదని చెప్పారు. ప్రజలతో పాటు ప్రభుత్వాల సహకారం ఎప్పటికీ ఉంటుందనే తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.