డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మంచిదేనా? ఏమైనా రిస్క్ ఉందా?

డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మంచిదేనా? ఏమైనా రిస్క్ ఉందా?
నయా ట్రెండ్‌.. డిజిటల్‌ గోల్డ్‌ తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్‌‌ చేయొచ్చు ఇళ్లకే డెలివరీ, ఎప్పుడైనా అమ్ముకునే వీలు కానీ, ఇన్వెస్టర్లకు అదనపు ఛార్జీల భారం బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కరోనా సంక్షోభంతో గోల్డ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లలో మార్పులొచ్చాయి. డిజిటల్‌‌ గోల్డ్‌‌ వంటి కొత్తరకం ఇన్వెస్ట్‌‌మెంట్లు ఊపందుకున్నాయి.  పేటీఎం, ఫోన్‌‌పే, జీపే వంటి  డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లు ఆఫర్‌‌‌‌ చేస్తుండడంతో ప్రజలలో వీటి పాపులారిటీ పెరుగుతోంది.  కానీ ఈ డిజిటల్‌‌ గోల్డ్‌‌పై  ఇన్వెస్ట్‌‌ చేయడం మంచిదేనా? ఏమైనా రిస్క్ ఉంటుందా? అనే అనుమానాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయనే చెప్పొచ్చు. అసలు డిజిటల్‌‌ గోల్డ్‌‌ అంటే ఏంటి? వీటిని ఎవరు అమ్ముతారు? వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎంత వరకు మంచిది? అనే అంశాలను చూద్దాం.. డిజిటల్‌‌ గోల్డ్‌‌ అంటే.. డిజిటల్‌‌ గోల్డ్‌‌కు ఫిజికల్‌‌ గోల్డ్‌‌ బ్యాకప్‌‌గా ఉంటుంది. అంటే కస్టమర్‌‌‌‌ ఆన్‌‌లైన్‌‌లో గోల్డ్‌‌ కొంటే ఆ పరిమాణానికి తగ్గ ఫిజికల్‌‌ గోల్డ్‌‌ను  గోల్డ్‌‌ ప్రొడ్యూసర్లు లేదా వెండర్లు కొనుగోలు చేస్తారు. వీటిని వాల్ట్‌‌లలో స్టోర్ చేస్తారు. ప్రస్తుతం ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజిటల్‌‌ గోల్డ్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలు డిజిటల్‌‌గా గోల్డ్‌‌ను అమ్ముతున్నాయి. ప్రభుత్వం సంస్థ మెటల్స్‌‌ అండ్‌‌ మినరల్స్‌‌ ట్రేడింగ్‌‌ కార్పొరేషన్‌‌, స్విస్‌‌ కంపెనీ ఎంకేఎస్‌‌ పీఏఎంపీలు కలిసి ఎంఎంటీసీ–పీఏఎంపీ జాయింట్ వెంచర్‌‌‌‌ను ఏర్పాటు చేశాయి.  మరోవైపు డిజిటల్‌‌ గోల్డ్‌‌ ఇండియా ‘సేఫ్‌‌గోల్డ్‌‌’ బ్రాండ్‌‌తో ఈ డిజిటల్ గోల్డ్‌‌ను అమ్ముతోంది. ఈ కంపెనీకి ప్రైవేట్‌‌ ఈక్విటీ ఫండ్స్‌‌ మద్దతుగా ఉన్నాయి. ఇంకా వరల్డ్‌‌ గోల్డ్‌‌ కౌన్సిల్‌‌కు కూడా ఇందులో మైనార్టీ వాటా ఉంది. పేటీఎం, మోతిలాల్‌‌ ఓస్వాల్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌, స్టాక్ హోల్డింగ్‌‌ కార్పొరేషన్‌‌ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా ఎంఎంటీసీ–-పీఏఎంపీ డిజిటల్‌‌ గోల్డ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను ఆఫర్ చేస్తుండగా, సేఫ్‌‌గోల్డ్‌‌ మాత్రం ఐసీఐసీఐ బ్యాంక్‌‌, పైసాబజార్ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా డిజిటల్‌‌ గోల్డ్‌‌ను అందిస్తోంది. నాణ్యత, ధర..సేఫ్టీ నాణ్యత పరంగా డిజిటల్‌‌ గోల్డ్‌‌ బెస్ట్‌‌ అని చెప్పొచ్చు. ఎంఎంటీసీ–పీఏఎంపీ 24 క్యారెట్స్‌‌ గోల్డ్‌‌ను 999.9 ప్యూరిటీతో ఆఫర్ చేస్తుండగా, సేఫ్‌‌గోల్డ్‌‌ మాత్రం 24 కే గోల్డ్‌‌ను 995 ప్యూరిటీతో ఆఫర్ చేస్తోంది. డిజిటల్‌‌ గోల్డ్ ధరలు వెండర్లు లేదా ప్రొడ్యూసర్లపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా వీటి ధరలు మార్కెట్‌‌ ధరకు అనుగుణంగా ఉంటాయి.  ఇండియా మొత్తం మీద ఒకే ధర ఉంటుంది. డిజిటల్‌‌ గోల్డ్‌‌లో తక్కువ మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.  ఉదాహరణకు మోతిలాల్‌‌ ఓస్వాల్‌‌లో డిజిటల్‌‌ గోల్డ్‌‌ కొనాలంటే మినిమమ్‌‌ టికెట్‌‌ సైజు రూ. 1000 గా ఉండాలి. అదే పైసా బజార్‌‌‌‌ ఆఫర్ చేస్తున్న సేఫ్‌‌గోల్డ్‌‌ను కొనాలంటే మినిమమ్ రూ. 100 ఇన్వెస్ట్‌‌ చేస్తే సరిపోతుంది. కస్టమర్లు ఈ డిజిటల్‌‌ గోల్డ్‌‌ను తిరిగి అమ్మడం లేదా డెలివరీ చేసుకునేంత వరకు కంపెనీలు వీటిని స్టోర్‌‌‌‌ చేస్తాయి. ఎంఎంటీసీ–పీఏఎంపీ అయితే ఐదేళ్ల వరకు ఎటువంటి ఛార్జీ లేకుండా స్టోరేజి ఆప్షన్ ఇస్తుండగా, సేఫ్‌‌గోల్డ్ మాత్రం రెండేళ్ల వరకు ఫ్రీ స్టోరేజి ఆప్షన్‌‌ను అందిస్తోంది.  ఇన్వెస్టర్లు కొన్న డిజిటల్‌‌ గోల్డ్‌‌కు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు అమ్మిన గోల్డ్ నాణ్యతను చెక్ చేసేందుకు ట్రస్టీషిప్‌‌లు ఉంటాయి. ఎంఎంటీసీ–పీఏఎంపీ, సేఫ్‌‌గోల్డ్‌‌కు ఐడీబీఐ ట్రస్టీషిప్‌‌ సర్వీసెస్‌‌ ట్రస్టీగా పనిచేస్తోంది.  డిజిటల్‌‌ గోల్డ్‌‌లోని రిస్క్‌‌లు.. డిజిటల్‌‌ గోల్డ్‌‌ను మానిటర్ చేయడానికి ఎటువంటి రెగ్యులేటరీ పనిచేయడం లేదు. సాధారణంగా ఇన్వెస్టర్‌‌‌‌ డిజిటల్‌‌ గోల్డ్‌‌ను కొనగానే వారు కొన్న పరిమాణానికి తగ్గ ఫిజికల్‌‌ గోల్డ్‌‌ను కంపెనీలు కొని వాల్ట్‌‌లలో నిల్వ చేస్తాయి. వీటిని చూసేందుకు ట్రస్టీలను నియమిస్తాయి. కానీ ఈ ట్రస్టీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసే రెగ్యులేటరీ సంస్థ ప్రస్తుతం పనిచేయడం లేదు.  కంపెనీలే ఆడిటర్లను నియమించి ఆడిట్ చేయిస్తాయి. కానీ ఈ రిపోర్ట్‌‌లు తిరిగి ఆ కంపెనీలకే అందుతాయి. గోల్డ్‌‌ ఈటీఎఫ్‌‌లను సెబీ, గోల్డ్‌‌ బాండ్లను  ఆర్‌‌‌‌బీఐ మానిటరీ చేస్తున్నట్టు డిజిటల్ గోల్డ్‌‌ విషయంలో ఇలాంటి సంస్థలేవి లేవు.   దీంతో ఇన్వెస్టర్లు కొన్న డిజిటల్‌‌ గోల్డ్‌‌ కంపెనీల దగ్గర సేఫ్‌‌గా ఉంటాయని చెప్పడం కష్టం. ఒక వేళ ఇన్వెస్టర్‌‌‌‌ తన దగ్గరున్న డిజిటల్‌‌ గోల్డ్‌‌ను అమ్మాలని చూస్తే కొనేందుకు సరిపడ డబ్బులు కంపెనీల దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ వీరిదగ్గర సరిపడ డబ్బులు లేకపోతే దాని ప్రభావం ఇన్వెస్టర్లపై తీవ్రంగా పడుతుంది. డెలివరీ ఛార్జీల మోత.. డిజిటల్‌‌ గోల్డ్‌‌లో ఉన్న మరో రిస్క్‌‌ ఏంటంటే వీటిని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి వీలుండదు. కంపెనీలిచ్చిన టైమ్‌‌ పీరియడ్‌‌ దాటి స్టోర్‌‌‌‌ చేసుకోవాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా డిజిటల్‌‌ గోల్డ్‌‌కు బదులు కంపెనీలు ఆమోదం పొందిన జ్యూయలరీ కంపెనీల నుంచి నగలను కొనుగోలు చేసుకునే అవకాశం ఇన్వెస్టర్లకు ఉంటుంది. కానీ జ్యుయలరీ షాపుల వారు తక్కువ క్వాలిటీ నగలతో ఇన్వెస్టర్లను మోసం చేసే అవకాశం ఉంది. డిజిటల్‌‌ గోల్డ్‌‌ను ఇంటి దగ్గరకే డెలివరీ చేసుకోవచ్చు. కానీ డెలివరీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గోల్డ్‌‌ను కాయిన్‌‌ లేదా బార్‌‌‌‌ల రూపంలో డెలివరీ చేస్తారు కాబట్టి వీటి మేకింగ్ ఛార్జీలను ఇన్వెస్టర్లే భరించాల్సి ఉంటుంది. ఫిజికల్‌‌ గోల్డ్‌‌పై విధించే జీఎస్‌‌టీనే డిజిటల్‌‌ గోల్డ్‌‌పై కూడా విధిస్తారు.ఈ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. వీటితో పాటు డిజిటల్‌‌ గోల్డ్‌‌ను కొనేటప్పుడే వీటిపై జీఎస్‌‌టీ ఖర్చులు, ఇన్సూరెన్స్‌‌, ట్రస్టీషిప్‌‌ ఖర్చులు, స్టోరేజి ఖర్చులు వంటివి కలిసుంటాయి. వీటిని ఇన్వెస్టర్లే భరించాలి. For More News.. టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే గొప్ప విజయం న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా శాలరీ డేస్‌‌‌‌‌‌‌‌’ ఇంకా అందని వరదసాయం.. రోడ్డు మీదే వంట చేసుకుంటున్న బాధితులు ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్