డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఇంజినీర్​ను నిర్బంధించి 10 కోట్లు దోచిన కేటుగాళ్లు

  • డ్రగ్స్ కొరియర్ వచ్చిందని రిటైర్డ్ ఇంజినీర్​ను దోచిన కేటుగాళ్లు
  • 8 గంటలపాటు నిర్బంధించి డబ్బంతా ట్రాన్స్​ఫర్ 
  • కొద్దిరోజుల కింద ఢిల్లీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి 

న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఇంజినీర్​ ను ట్రాక్ లోకి దింపి రూ.10 కోట్లకుపైగా కొల్లగొట్టారు. మీ పేరుతో డ్రగ్స్ కొరియర్ వచ్చిందంటూ బ్లాక్ మెయిల్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 8 గంటలపాటు నిర్బంధించారు. కొడుకు, బిడ్డలను టార్గెట్ చేస్తామని బెదిరించి డబ్బంతా ట్రాన్స్​ఫర్ చేయించుకుని వదిలేశారు. ఆ వెంటనే బాధితుడు సైబర్ క్రైంను ఆశ్రయించాడు. ఢిల్లీలో కొద్దిరోజుల కింద ఈ ఘటన జరిగింది.

డబ్బు ట్రాన్స్​ఫర్ అయ్యేదాకా కదలనియ్యలే.. 

ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన 72 ఏండ్ల రిటైర్డ్ ఇంజినీర్​కు స్కామర్ల నుంచి కాల్ వచ్చింది. మీ పేరుతో తైవాన్ నుంచి డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ బెదిరింపులకు దిగారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వీడియో కాల్ చేస్తారని చెప్పి స్కైప్ యాప్ ను డౌన్​లోడ్ చేయించారు. ఆపై పోలీసుల వేషంలో ఉన్న వ్యక్తులు వీడియో కాల్ కలిపి బాధితుడిని రూంలోంచి కదలొద్దని బ్లాక్ మెయిల్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అంటూ 8 గంటలపాటు వేధించారు. 

డబ్బు ట్రాన్స్​ఫర్ చేస్తే వదిలేస్తామని బాధితుడి నుంచి రూ.10 కోట్లకుపైగా పలు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని కాల్ కట్ చేశారు. ఆపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ సైబర్ క్రైం టీమ్స్.. రూ.60 లక్షలను బాధితుడి ఖాతాలోంచి ట్రాన్స్​ఫర్ కాకుండా స్తంభింపజేశాయి. మిగతా డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్కామర్లు విదేశాల నుంచి కాల్ చేసినప్పటికీ, మనదేశంలోని వాళ్ల అనుచరులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్​లో ఉన్న కొడుకును, సింగపూర్​లో ఉంటున్న ఇద్దరు పిల్లలను టార్గెట్ చేస్తామని నేరగాళ్లు బెదిరించడంతో వివరాలు వెల్లడించానని బాధితుడు వాపోయాడు.