ఇల్లీగల్ యాక్టివిటీస్ ను సహించేది లేదు : డీఐజీ ఎల్ఎస్​ చౌహాన్

గద్వాల, వెలుగు: ప్రతి పోలీస్  ఆఫీసర్ బాధ్యతాయుతంగా పని చేసి ప్రజల మన్నలను పొందాలని, ఇల్లీగల్  యాక్టివిటీస్ ను సహించేది లేదని జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్​ చౌహాన్  స్పష్టం చేశారు. బుధవారం ఇటిక్యాల పోలీస్ స్టేషన్, ఎస్పీ, డీఎస్పీ, అలంపూర్  సర్కిల్  ఆఫీస్​ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఇటిక్యాల పీఎస్  ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. 24 గంటలు గస్తీ నిర్వహించాలని, చోరీల నియంత్రణ కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. 

రౌడీషీటర్స్, అనుమానితులు, పాత నేరస్థులపై నిఘా పెట్టి వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గంజాయి, గుట్కా, గ్యాంబ్లింగ్, గుడుంబా తదితర ఇల్లీగల్  యాక్టివిటీస్ పై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో ఇల్లీగల్  యాక్టివిటీస్ ను సహించేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్  డీఎస్పీ సురేందర్ రావు, సీఐలు రవిబాబు, నాగేశ్వర్ రెడ్డి, టాటా బాబు పాల్గొన్నారు.