సాధారణంగా, శివుడంటే, ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక. కానీ ఆయనను అర్ధనారీశ్వరుడిగా చూసినప్పుడు, ఆయనలో అర్ధభాగం ఒక సంపూర్ణమైన స్త్రీ రూపం. జరిగిన కథ ఏమిటో చెప్తాను వినండి. శివుడు పరమానంద పారవశ్య స్థితిలో ఉండేవాడు. ఆ స్థితిలో ఆయనను చూసి పార్వతి ఆయన పట్ల ఆకర్షితురాలైంది. ఆయన ప్రేమను పొందేందుకు ఎంతో కష్టపడింది, ఎంతో సహాయం కోసం ఎదురుచూసింది. చివరకు వాళ్ళు పెళ్లిచేసుకొన్నారు. పెళ్లయిన తరవాత, సహజంగానే శివుడు, తన అనుభవాలన్నీ ఆమెతో పంచుకోవాలనుకొన్నాడు.
'మీలో మీరు రమిస్తూ, నిత్యం అనుభవించే ఈ ఆనంద పారవశ్య స్థితి నాకూ అనుభవించాలని ఉంది. అందుకు నేనేం చేయాలో చెప్పండి. దానికోసం ఎలాటి తపస్సు చేయటానికైనా నేను సిద్ధమే' అన్నది పార్వతి. శివుడు చిరునవ్వు నవ్వి, “నువ్వు గొప్ప తపస్సేమీ చెయ్యక్కర్లేదు. ఊరికేవచ్చినా ఒడి లో కూర్చో, చాలు!' అన్నాడు. పార్వతి వచ్చి నిస్సంకోచంగా ఆయన ఒడిలో ఎడమపక్క కూర్చొంది. ఆమె అలా వెంటనే ఇష్టపూర్వకంగా వచ్చి, తనను తాను అలా నిస్సంకోచంగా సమర్పించుకోవటంతో, శివుడు ఆమెను తనలోకి తీసుకొని తన శరీరంలో అర్ధ భాగంగా మార్చుకొన్నాడు.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆమెను తన శరీరంలో అర్ధభాగంగా చేసుకోవాలంటే, శివుడు, తన శరీరంలో సగాన్ని త్యాగం చేయాలి కదా? ఆయన అలా తన శరీరంలో సగ భాగం వదిలివేసుకొని, ఆమెకు తనలో చోటు కల్పించాడు. అర్ధ నారీశ్వరుడి కథ ఇది. పురుషత్వమూ, స్త్రీత్వమూ రెండూ సమ భాగాలుగా నీలోనే దాగి ఉంటాయని చూపే కథ ఇది.
also read : Mahashivratri 2024 : మహా శివుడి గురించి.. కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా..
ఆమెను తనలో చేర్చుకొన్న తరవాత శివుడు మళ్ళీ పరమానంద పరవశుడయ్యాడు. చెప్పేదేమిటంటే, అంతర్గతంగా పురుషత్వ, స్త్రీత్వాలు రెండూ కలిస్తే, మీరు నిరంతర పరమానంద పారవశ్యంలో ఉండిపోతారు. ఇది బాహ్యంగా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం, అది ఎక్కువ కాలం నిలవదు. దాంతో వచ్చే సమస్యలన్నీ ఒక అంతులేని నాటకం.