Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ

కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు (Dhruva Vayu) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కళింగ’(Kalinga). బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మైథాలజీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 13న) సినిమా థియేటర్లలలో రిలీజ్ అయింది. 

సినిమా మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశారు మేకర్స్. ఈ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. "కాంతారా", "మంగళవారం", విరూపాక్ష లాంటి సినిమాలతో కళింగని పోల్చి చూస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా నేడు థియేటర్ కి వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.

Also Read:-శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాని, సాయి పల్లవి?

కథేంటంటే::

కళింగ రాజసంస్థానంలో మనుషులు తమ శరీర అవయవాలను వాళ్ళే కోసుకొని తింటూ ఉంటారు. అలాంటి ఊహించని పలు సంఘటనలు జరగడంతో రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అడివిలోని ఓ ఊళ్ళో ఒకవైపు పొలిమేర దాటి అడివి లోపలికి ఎవరు వెళ్ళరు. అటు వెళ్లిన వాళ్ళు ఎవరు బతికి తిరిగిరాలేదు. కళింగ ఊర్లో అనాథ అయిన లింగ (ధృవ వాయు) ఆ ఊళ్ళో తన ఫ్రెండ్ (లక్ష్మణ్ మీసాల)తో కలిసి సారా కాస్తూ ఉంటాడు..ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్), అతని తమ్ముడు బలి (బలగం సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. బలి కనిపించిన ఆడవాళ్ల మీద దారుణాలకు ఒడిగడుతాడు. నచ్చిన ఆడవాళ్ళ మీద కన్నేస్తుంటాడు. ఇక లింగ చిన్నతనం నుంచి కూడా పద్దు (ప్రగ్యా నయన్) ప్రేమిస్తుంటాడు. పద్దు కూడా లింగను ప్రేమిస్తుంది. ఇంతలో పద్దు మీద బలి కన్ను పడుతుంది. లింగతో పెళ్లి చేసుకోవడానికి ఓ చిక్కు ముడి వేస్తాడు పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్).

ఊరి పెద్ద వద్ద తనఖాలో ఉన్న తన పొలాన్ని విడిపించుకుని వస్తేనే..మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని అంటాడు. దీంతో లింగకి సంస్థానంలోని స్థలం రాసిస్తాడు. అయితే, ఆ సంస్థానంలో జరిగిన నేపథ్యం ఏంటి? ఆ సంస్థానానికి గతంలో ఉన్న శాపం ఏంటి? అక్కడికి వెళ్లిన వాళ్లు మళ్ళీ ఎందుకు తిరిగి రారు? లింగ అంతటి సరిహద్దుని దాటిన తరువాత ఏం జరుగుతుంది? ఇక అందరి మధ్యలో ఉన్న అసుర భక్షి ఏంటి? ఇక ఇంతకీ రాజసంస్థానానికి ప్రస్తుతం అడివికి సంబంధం ఏంటి? ఇలాంటి సంఘర్షణలకు మధ్య ఉన్న లింగ చివరకు ఏం చేశాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఇటీవల రాజుల కాలం, అమ్మవారు, రాక్షసుడు, అడవి నేపధ్యం, హర్రర్ కథాంశం వంటి స్టోరీస్ తో మేకర్స్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ కళింగ మూవీ కూడా అలాంటి థ్రిల్లర్ మైథాలజీ కోవకి చెందింది. కళింగ సినిమా ఒక నిధి వేట కథని సరికొత్తగా హారర్ జానర్ లో డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేసారు రైటర్ కం డైరెక్టర్ ధ్రువ. 

అయితే సినిమా మొదట్లో, సెకండ్ హాఫ్ కాసేపు ఆల్మోస్ట్ 10 నిమిషాల పైన వాయిస్ ఓవర్ తోనే కథలోని పలు కీలక అంశాలు చెప్పే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో కళింగ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా వైవిధ్యతతో కూడి ఉంటుంది. పేపర్ మీద కథను రాసుకున్నప్పుడు ఈ స్టోరీ కచ్చితంగా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. 

ఫస్ట్ హాఫ్ అంతా పొలిమేర చూపించి భయపెడుతూనే హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని బాగానే భయపెట్టారు. దీంతో అసలు పొలిమేర అవతల అడివిలో ఏముంది అని ఆసక్తి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో పాతుకుంటుంది. అలాగే రాజసంస్థానం అసలు కథ ఏమైంది..అక్కడికి వెళ్లిన మనుషుకు ఏమవుతున్నారు..అనే ఆసక్తి క్రియేట్ చేయటంలో మేకర్స్ పనితీరు బాగుంది. ఈ కథలో పొలిమేర దాటిన వ్యక్తులేం అవుతున్నారు? వారిని ఎవరు అలా భక్షిస్తున్నారు? అనే పాయింట్లతో ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుంది.దీంతో కళింగ సెకండాఫ్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచుతాడు డైరెక్టర్. 

వీటన్నిటికీ సెకండ్ హాఫ్ లో చెప్పే సమాధానాలు ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని సన్నివేశాలను బాగా చూపించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సెకండాఫ్‌లో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బాగుండేది. అయితే ఈ సెకండాఫ్‌కు ప్రధాన బలం.. చివరి 20 నిమిషాలు. మేకర్స్ వీఎఫ్ఎక్స్‌తో ఆకట్టుకుంటారు. వాటిని చూస్తే ఈ మధ్య వచ్చిన కాంతార, విరూపాక్ష, హనుమాన్ చిత్రాలు కూడా గుర్తుకు వస్తాయి.క్లైమాక్స్ లో అమ్మవారు వచ్చినట్టు వేసే గ్రాఫిక్ సీన్స్, దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రేక్షకులు ఫిదా అవుతారు.

ఎవరెలా నటించారంటే:

హీరో ధ్రువ వాయు హీరోగా కంటే కూడా దర్శకుడిగానే సక్సెస్ అయ్యాడు. ధృవ వాయు తన పాత్రకు న్యాయం చేశాడు. లింగ కారెక్టర్‌కు కావాల్సిన రఫ్ నెస్, రగ్డ్ నెస్‌ను చూపించాడు. హీరోయిన్ ప్రగ్య నయన్ కేవలం ప్రేమ కథకు మాత్రమే. తన అందం, నటనతో మెప్పించింది. విలన్లుగా కనిపించిన ఆడుకాలం నరైన్, బలగం సంజయ్ పర్వాలేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్, అబ్దుల్ రషీద్ తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు. 

సాంకేతిక అంశాలు:

విష్ణు శేఖర మరియు అనంత నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మంగళవారం, విరూపాక్ష సినిమా రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. పాటలు యావరేజ్.

హీరో కం డైరెక్టర్ ధృవ వాయు ఎంచుకున్న సబ్జెక్ట్ విభిన్నంగా ఉంది. ముఖ్యంగా ఊరికి ఉన్న శాపం. ఊరి పొలిమేర దాటితే కలిగే అనర్ధాలను చక్కగా ప్రెజెంట్ చేసాడు. ఒక్కమాటలో దర్శకుడిగా ధృవ వాయు సక్సెస్ అయ్యాడు.ఇకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం బాగుంది. అడవిలో ఊరు సెట్, అడవిలో భయపెట్టడానికి సెటప్స్ అన్ని బాగా డిజైన్ చేసారు. నిర్మాణ పరంగా కథకు కావాల్సినంత బాగానే నిర్మాతలు ఖర్చు చేసిన ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది. ఉన్నతంగా ఉన్నాయి.