పెండింగ్​ బిల్లులు విడుదల చేయాలని ధర్నా

మెదక్​ టౌన్, వెలుగు : పెండింగ్​బిల్లులు విడుదల కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్​) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఆ సంఘం జిల్లా నాయకులు, టీచర్లు కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తపస్​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ మాట్లాడుతూ.. పెండింగ్​లో ఉన్న 4 డీఏలను వెంటనే ప్రకటించాలని

పీఆర్సీ​రిపోర్టు తెప్పించుకొని 60 శాతం ఫిట్​మెంట్​తో అమలు చేయాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని,  జీపీఎఫ్​ పెండింగ్ బిల్లును విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్​కలెక్టర్​నగేశ్​కు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్ నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్ : పెండింగ్​డీఏలు, బిల్లులు చెల్లించాలని తపస్​ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దత్తాత్రి , అడివప్ప మాట్లాడుతూ.. టీచర్లకు రావాల్సిన డీఏలు, జీపీఎఫ్, మెడికల్, సరెండర్, రిటైర్​మెంట్ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు.

వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్​చేశారు. అనంతరం  కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తపస్​జిల్లా బాధ్యులు, టీచర్లు పాల్గొన్నారు. 

సిద్దిపేట : ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే  నెరవేర్చాలని, కాంగ్రెస్​మేనిఫెస్టోలో పెట్టిన పీఆర్సీ ని వెంటనే అమలు చేసి, పెండింగ్​బిల్లులను  ఏకకాలంలో చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్థన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహంచిన ధర్మాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను విస్మరించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.