సీసీఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: బషీర్ బాగ్​లోని సీసీఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరమ్ మంగళవారం ఆందోళనకు దిగింది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని, బ్రాహ్మణులను మోసం చేసిన సంస్థ ఎండీ కమలాకర్ శర్మను కఠినంగా శిక్షించాలని ఫోరమ్ కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. జనవరి15లోగా బాధితులకు కట్టిన డబ్బులు చెల్లించకపోతే సీసీఎస్​ను ముట్టడించడంతోపాటు కమలాకర్​పై ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు.

కోర్టులో వాయిదాల పేరుతో  కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, సీసీఎస్​లోని పోలీసు అధికారులతో సంస్థ ఎండీ కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. తాము 3 వేల మంది బాధితులం ఉన్నామని, దాదాపు వెయ్యి కోట్లు మోసం చేశారన్నారు. ధన్వంతరి ఫౌండేషన్​లో పలువురు ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్​లను డైరెక్టర్​లుగా నియమించుకొని, ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

బ్యాంకుల కంటే అధిక వడ్డీ పేరుతో లక్ష నుంచి 10 కోట్ల వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన బాధితులను దోచుకున్నారన్నారు. ఈ డిపాజిట్ దారుల్లో చాలా మంది 75 ఏండ్ల పైబడిన వారే ఉన్నారన్నారు. ధన్వంతరి ఫౌండేషన్ అంబర్ పేట్ ఆఫీస్​ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. సీసీఎస్ నుంచి వెంటనే చార్జ్ షీట్ వేయాలన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని, నిందితుడి పాస్ పోర్ట్, ఆస్తులు అకౌంట్లు సీజ్ చేసి, తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.