ధనుర్మాసం: తిరుప్పావై 23వ పాశురం ..గోపికల కష్టాలను తీర్చిన కృష్ణుడు

గోపికలు తమ మనోరథము రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామంటపమున విన్నవించవలెనని ఆస్థానమండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలింపవలెనని ఈ పాశురమున కోరుచున్నారు. 

అనన్యగతికలమై వచ్చి నిన్ను ఆశ్రయించినాము కటాక్షింపుము. అని గోపికలు ప్రార్థింపగా, శ్రీకృష్ణుని మనసులో చాలా బాధకలిగెను. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడి రక్షింపవలసియుండగా, వేరొక గతిలేనివారము అని దైన్యముగా పలుకునట్లు ఉపేక్షించితినే ! ఎంత తప్పు చెసితిని అని కృష్ణుడు చాలా నొచ్చుకొనెను. స్త్రీలు ఇంట బాధపడుచుండగా ఊరకుండుట న్యాయముకాదు అని కృష్ణుడు బాధపడి, ఏమికావలెనో తెలపండి అని గోపికలను అడిగెను.

    మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్ 
    శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు 
    వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
    మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు
    పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్ 
    కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ 
    శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద
    కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్!!

భావం : పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని, తీక్షణమగు చూపులని ఇటుఅటు చూచి, ఒకవిధమగు వాసన గల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు చేసి, అన్నివైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు - ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటకు వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ... నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. 

వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ.. నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె... అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె.... ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె... అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.   

మమ్మల్ని కటాక్షింపవయ్యా... అని ఎంత వేడినా పలుకకున్నవానిని చూచి, నీళాదేవి నాశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి 'అయ్యో... వీరినెంత బాధపెట్టితిని . వీరికి ముందుగనే, నేను కావలసినవి యిచ్చి వుండవలసినది. అని ఎంతో కలత చెందాడు, నావారినే నేను ఉపేక్షించాను. దీనులై అర్ధించేటట్లు చేశాన ని  ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసులనుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు యీ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే ..మీకేమికావలెనని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తున్నాడు. మాకే కామనలు లేవు స్వామీ... నీవు నీ భవనము నుండి వచ్చి యీ సింహసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదుమనిరి .అదే యీ (పాశురంలో) వర్ణితము.