ధనుర్మాసం: తిరుప్పావై 15 వ రోజు పాశురము.. గోపికల మధ్య జరిగిన సంభాషణ ఇదే..!

పదిహేనవ పాశురం బయట గోపబాలికలకు...  లోపలగోపబాలిక మద్య సంభాషణ  సాగుతుంది.  భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టమంటూ.. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్!!


ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది. 


బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ? 
లోపల గోపిక     : పూర్ణలగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను. 
బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము. 
లోపల గోపిక     : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే   కఠినురాలను. 
బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము. 
లోపల గోపిక     :  అందరు గోపికలు వచ్చిరా ?
బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. 
లోపల గోపిక     : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?
బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.

అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో,....ఎల్లే!... ఏమే ....ఇళంకిళియే.... లేత చిలకా  ...ఇన్నం ఉఱంగుదియో".....ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి .  ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

ఆండాళ్ తల్లి ...  మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో.... పెరిగింది గోకులంలో... అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ.      

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని,  శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి ....శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్.... ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు ...నంగైమీర్!.... పరిపూర్ణులు మీరే.  "పోదరుగిన్ఱేన్... వస్తున్నాను అని అంది.           

 వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన  గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది.