అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ జితేందర్.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ మీద నమోదు అయిన కేసుపై తెలంగాణ డీజీపీ జితేందర్ మరోసారి స్పందించారు. ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 29) తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కేసుపై జర్నలిస్టులు డీజీపీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటుడు అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. ఈ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఇప్పుడు మేం ఏం మాట్లాడలేమని అన్నారు. 

అలాగే.. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పోలీసుల వరుస ఆత్మహత్యల అంశంపైన డీజీపీ రియాక్ట్ అయ్యారు. ఈ ఏడాదనే కాదు.. ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో ఇలాగే కొందరు పోలీసులు సూసైడ్ చేసుకుంటున్నారని.. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‎తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని క్లారిటీ ఇచ్చారు. కొన్ని కేసుల్లో వర్క్ ప్రెజర్స్ వలన కూడా పోలీసులు ఆత్మహత్య లు చేసుకుంటున్నట్లు గుర్తించామని చెప్పారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులకు పిలుపునిచ్చారు. 

Also Read : తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్

కాగా, 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‎లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‎ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 ముద్దాయిగా చేర్చారు. 

2024 డిసెంబర్ 13న ఈ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్‎ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ బన్నీకి ఊరట దక్కింది. హైకోర్టు అల్లు అర్జున్‎కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పుష్ప చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.