పన్నుల వసూలు చేసే వారికి క్యాష్​ రివార్డులు అందిస్తాం : డీజీజీఐ

పన్నుల వసూలు చేసే వారికి క్యాష్​ రివార్డులు అందిస్తాం : డీజీజీఐ

ప్రకటించిన డీజీజీఐ

న్యూఢిల్లీ: పన్నుల వసూలు/రికవరీకి సాయం చేసే వారికి క్యాష్​ రివార్డులు అందిస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ప్రకటించింది. పన్నులు ఎగ్గొట్టేవారి గురించి చెప్పిన వాళ్ల వివరాలను లీక్​ చేయబోమని హామీ ఇచ్చింది.  ఇందుకోసం డీజీజీఐ రివార్డ్ స్కీమ్​ను ప్రవేశపెట్టింది. జీఎస్‌‌‌‌టీ, సెంట్రల్‌‌ ఎక్సైజ్‌‌ డ్యూటీ, సర్వీస్‌‌ ట్యాక్స్‌‌ ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు చెబితే నజరానా ఉంటుందని  ఏజెన్సీ తన వెబ్‌‌సైట్‌‌లో వెల్లడించింది. సరైన మొత్తంలో పన్ను చెల్లించడమంటే దేశం పట్ల సామాజిక బాధ్యతను నెరవేర్చడమేనని కామెంట్​ చేసింది. పన్నులు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరు కాబట్టి, వీటి ఎగవేత వల్ల తీవ్ర నష్టాలు ఉంటాయని ఆందోళన ప్రకటించింది.  సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్  జీఎస్‌‌టీ వంటి పన్నుల ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడానికి  ప్రతి ఒక్కరూ తమతో చేతులు కలపాలని కోరింది.  పన్ను ఎగవేత జరిగినట్టు తెలిస్తే వాళ్ల గురించి లెటర్​, ఫోన్, ఈ–-మెయిల్, వెబ్‌‌సైట్ లేదా వ్యక్తిగతంగా తమను సంప్రదించాలని కోరింది. ఎగవేతదారులపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు.  

ఇచ్చిన సమాచారం పన్నుల రికవరీకి  ఉపయోగపడితే  తప్పక క్యాష్​ రివార్డ్​ ఇస్తామని ఈ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సూర్జిత్ భుజబల్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో భుజబల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌‌గా బాధ్యతలు చేపట్టారు.  పలు చట్టాల కింద జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం, ఇన్‌‌ఫార్మర్లతోపాటు  ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రివార్డులు ఇస్తారు. సుంకం, పన్ను, జరిమానా,  పెనాల్టీ, బకాయిలు చెల్లించాల్సిన వ్యక్తుల ఆస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.  పన్ను రికవరీ కోసం ప్రయత్నాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు సైతం రివార్డుకు అర్హులు అవుతారు.  స్వాధీనం చేసుకున్న నిషేధిత వస్తువులు  లేదా సుంకాలు/సేవా పన్ను ఎగవేత మొత్తం లేదా రికవరీ అయిన పెనాల్టీ మొత్తంలో (నికర అమ్మకం రాబడి)లో 20శాతం వరకు ఇన్​ఫార్మర్లకు లేదా అధికారులకు చెల్లిస్తారు.