ఫాబీఫ్లూకు ఇంత రేటు పెడితే ఎలా!

ఫాబీఫ్లూకు ఇంత రేటు పెడితే ఎలా!

గ్లెన్మార్క్ పై డ్రగ్ కంట్రోల్ జనరల్  ఫైర్

న్యూఢిల్లీ: కరోనా ట్రీట్మెంట్ కోసం గ్లెన్మార్క్ తయారు చేసిన ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమానీ విమర్శించారు.  కరోనా ఏస్థాయిలో ఉన్నా తగ్గిస్తుందంటూ ప్రచారం చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఇంత రేటు పెడితే పేదలు, మధ్యతరగతి జనం ఎలా కొంటారని ప్రశ్నిస్తూ గ్లెన్మార్క్కు లెటర్ రాశారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశించింది. ఒక ఎంపీ కంప్లెయింట్ ఇవ్వడంతోనే డీసీజీఐ గ్లెన్మార్క్కు లెటర్ రాసినట్టు సమాచారం. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్న రోగులకూ  ఈ ట్యాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుందని ప్రచారం చేయడంపైనా సోమానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫావిపిరవిర్ జనరిక్ వెర్షన్ ట్యాబ్లెట్లను గ్లెన్మార్క్ ఫాబీఫ్లూ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 200 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ధరను రూ.103 నిర్ణయించింది. రోగులు దీనిని రెండు వారాలు వాడాలి. ఇందుకు రూ.12,500 ఖర్చు అవుతుంది. రేటు చాలా ఎక్కువని కంప్లెయింట్ రావడంతో ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.75కు తగ్గించింది. అయినప్పటికీ పూర్తి డోసు ధర రూ.9,150 వరకు ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సైతం ఆదేశించింది. దీనికి కూడా సోమానీయే హెడ్! ఫాబీఫ్లూ అమ్మకాలకు ఈ సంస్థ జూన్లో పర్మిషన్ ఇచ్చింది. ప్రయోగాల సందర్భంగా గ్లెన్మార్క్ దీనిని వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న కరోనా పేషెంట్లపై మాత్రమే ప్రయోగించిందని గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఇది కరోనాను తగ్గిస్తుందన్న ప్రచారాన్ని కొందరు డాక్టర్లు ఒప్పుకోవడం లేదు. తక్కువ తీవ్రత ఉన్న వారికి పారాసిటమాల్ వాడినా చాలని, ఇంత ఖరీదైన ట్యాబ్లెట్లు అవసరం లేదని వాదిస్తున్నారు. ఫాబీ ఫ్లూ వాడితే ఆకలి తగ్గడం, వాంతులు రావడం, కాలేయ సమస్యలు రావడంతో కొన్ని ఆస్పత్రులు దీని వాడకాన్ని నిషేధించాయి.