అలంపూర్​కు పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. 

తుంగభద్ర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా తుంగభద్ర నదికి అర్చకులు దశవిధ హారతులిచ్చారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించారు.