కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు కోనేరులో స్నానం చేసి స్వామి దర్శనం కోసం ఆలయంలో బారులుతీరారు. అనంతరం స్వామికి అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు చేసి ఒడి బియ్యం సమర్పించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరికొందరు కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కాగా సికింద్రాబాద్ కు చెందిన వేణుగోపాల్ -ధరణి దంపతులు స్వామికి వెండి చెంబు బహూకరించారు.  ఆలయ ఈవో బాలాజీశర్మ, ఏఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్​శ్రీరాములు, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు శ్రీరాములు, జూనియర్ అసిస్టెంట్ శంకర్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులకు సేవలందించారు.