యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

  • ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంటకుపైగా టైం
  • నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజులు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్‌‌‌‌ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు, బస్‌‌‌‌బే, క్యూకాంప్లెక్స్, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడింది.

రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకుపైగా పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు ఆలయంలో నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.57,65,859 ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.

హైకోర్టు జడ్జి ఎన్‌‌‌‌వీ.శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఫ్యామిలీతో కలిసి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంటపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈవో భాస్కర్‌‌‌‌రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.

నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 16 నుంచి జనవరి 14 వరకు ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు ‘తిరుప్పావై’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 13న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 14న ఉదయం 11.30 గంటలకు ‘ఒడి బియ్యం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.