జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు చేరుకొని తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సాయంకాలం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 

ఇదిలాఉంటే హాస్య నటుడు రాజేంద్రప్రసాద్, నర్సాపూర్  ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.