జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్,వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు.

 జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం గంటలు తరబడి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ రవిబాబు, ఎస్సై వెంకటస్వామి ఆధ్వర్యంలో ట్రాఫిక్  నియంత్రణ కోసం చర్యలు చేపట్టారు.

కురుమూర్తి టెంపుల్ కు.. 

చిన్నచింతకుంట, వెలుగు: ఆదివారం అమావాస్య కావడంతో కురుమూర్తి స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమ్రోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్  గోవర్ధన్ రెడ్డి, ఈవో మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ శేఖర్  ఏర్పాట్లు చేశారు.