హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్  శిల్పారామంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల  బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

 ప్రజా పాలన పథకాలపై సంగీత, నాటక, నృత్య, స్కిట్ అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేసిందన్నారు. అరాచక పాలన అంతమై ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.

కార్యక్రమంలో కలెక్టర్  విజయేందిర బోయి, అడిషనల్​కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు,రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్  అనిత, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, నాయకులు పాల్గొన్నారు.