వెలుగు సక్సెస్ : తెలంగాణ రక్షకులు : పెద్ద మనుషుల ఒప్పందంలోని కీలక అంశాలు

పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నోట్​ ఆన్ సేఫ్​ గార్డ్స్​ ప్రపోజ్డ్​ ఫర్​ ది తెలంగాణ ఏరియా అనే పత్రాన్ని తయారు చేసి 1956, ఆగస్టు 10న పార్లమెంట్​లో ప్రవేశ పెట్టారు. ఈ రక్షణల విషయమై పెట్టిన పత్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి బి.ఎన్​.దాతార్ లోక్​సభలో సమర్పించారు. అదే ప్రతులను ఆంధ్ర అసెంబ్లీ సభ్యులకు కూడా అందజేశారు. సేఫ్​గార్డ్స్​ రూపంలో  పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించారు.

ప్రాంతీయ సంఘం

ఆంధ్రప్రదేశ్​ మొత్తానికి ఒకే శాసనసభ ఉంటుంది. రాష్ట్రానికి చట్టాలు రూపొందించే వ్యవస్థ ఇదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ఒక గవర్నర్​ ఉంటాడు. రాష్ట్ర పరిపాలనలో ఆయనకు తోడ్పడుతూ తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర​ అసెంబ్లీకి బాధ్యత వహించి పనిచేసే మంత్రివర్గం ఒకటి ఉంటుంది. కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణను ఒక ప్రత్యేక ప్రాంతంగా పరిగణిస్తారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ శాసన సభ్యులకు, ముఖ్యమంత్రి మినహా ఆ ప్రాంతానికి చెందిన మంత్రులకు సభ్యత్వంతో ఒక ప్రాంతీయ సంఘం ఉంటుంది. 
 

ప్రత్యేక అంశాలకు సంబంధించి చట్టాలపై ప్రాంతీయ సంఘం సమాలోచనలు పంపాలి. ప్రత్యేకాంశాలకు సంబంధించిన చట్టం చేయడం కోసం ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయవచ్చు. లేదా ఆర్థిక భారం పడని సాధారణ విధానాలకు సంబంధించి చట్టం చేయడం కోసం ప్రతిపాదనలు చేయవచ్చు. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ సాధారణంగా ఆమోదించాలి. ఒకవేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే గవర్నర్​ దృష్టికి తీసుకువెళ్లాలి. గవర్నర్​ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఉభయ పక్షాల వారు పరస్పర ఆమోదంతో ఏమైనా మార్పులు చేసుకుంటే తప్ప ఈ ఒప్పందం 10 సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది. అనంతరం పున: పరిశీలించవచ్చు. 

డిమిసైల్​ నిర్ణయాలు (ముల్కీ నిబంధనలు)

సబార్డినేట్​ సర్వీసుల భర్తీ విషయంలో తెలంగాణ ఒక యూనిట్​గా పరిగణనలోకి తీసుకునేలా ఐదేండ్లపాటు తాత్కాలిక ఏర్పాటు చేస్తారు. ఈ కేడర్​లోని పోస్టులను ప్రస్తుత ముల్కీ నిబంధనల పరిధిలో వచ్చే వారి కోసం రిజర్వ్​ చేయవచ్చు. 

ఉర్దు భాషా స్థానం

భారత ప్రభుత్వం పాలన, న్యాయవ్యవస్థలో ఉన్న ఉర్దూ స్థానాన్ని రాబోయే ఐదేండ్లపాటు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా సూచనలిస్తుంది.

మిగులు ఉద్యోగుల తొలగింపు 

హైదరాబాద్​ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని భావించడం లేదని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సేవలలోకి వెళ్తారు. ఒకవేళ ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఉమ్మడి రాష్ట్రంలోని ఉద్యోగులకు సమానంగా ఆ తొలగింపు ఉంటుంది. 

వ్యయాల పంపిణీ

రాష్ట్ర వనరుల ద్వారా కేటాయించే వ్యయాల అంశం రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభల పరిధిలోనిదే. కేంద్రీకృత, సాధారణ పరిపాలన కోసం కొత్త రాష్ట్రం వెచ్చించే వ్యయాన్ని రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తి ప్రకారం భరించాలి. ఆదాయంలో మిగులును మాత్రం తెలంగాణ అభివృద్ధి నిమిత్తం వెచ్చించే వ్యయం కోసం అట్టిపెట్టాలి. 

ప్రాంతీయ సంఘానికిసంబంధించి అంశాలు

మొత్తం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర అసెంబ్లీ రూపొందించే ప్రణాళికలకు, విధానాల కు లోబడి తెలంగాణ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి కి రూపొందించాల్సిన కార్యక్రమాలు.
స్థానిక స్వపరిపాలన అంటే మున్సిపల్​ కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సాధన సంఘాలు, జిల్లా బోర్డులు, ఇతర జిల్లా అధికార సంస్థలు మొదలైన వాటికి చట్టరీత్యా ఉన్న అధికారాలు.

  • ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక హాస్పిటళ్లు, డిస్పెన్సరీలు.
  • ప్రాథమిక, మాధ్యమిక విద్య.
  • తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి సంబంధించి సమస్యలు.
  • మద్యపాన నిషేధం
  • వ్యవసాయ భూముల విక్రయం.
  • కుటీర, చిన్న పరిశ్రమలు
  • వ్యవసాయం, సహకార సంఘాలు,మార్కెట్లు, సంతలు.

తెలంగాణ ప్రాంతీయ కమిటీ

ఏడో భారత రాజ్యాంగ సవరణ చట్టం – 1956 ద్వారా ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల్లో శాసనసభలకు ప్రాంతీయ సంఘాలు ఏర్పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా శాసనసభల సంఘాల కార్యకలాపాలు రాష్ట్రమంతటికి సంబంధించి ఉంటాయి. పంజాబ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రూపొందించిన ప్రాంతీయ సంఘాలు రాష్ట్రంలోని కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం. రాష్ట్రాల పునర్విభజనతో మన దేశంలో ప్రాంతీయ సంఘాలు ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రాల పునర్విభజన సందర్భంలో ప్రాంతీయ అసమానతలను నిర్మూలించడానికి ప్రాంతీయ సంఘాలు దోహదం చేస్తాయి.

పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ మండలిగా పేర్కొన్న సంస్థ ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు చట్టంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మారింది. తెలంగాణ రక్షణలు, ప్రాంతీయ సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం లోక్​సభకు ఒక నోట్​ను సమర్పించింది. రాజ్యాంగంలోని ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 371 (1) అనే ఆర్టికల్​ ప్రాంతీయ సంఘాల ఏర్పాటు గురించి తెలుపుతుంది. ఈ అధికరణం ప్రాంతీయ సంఘాలు ఎంతకాలం ఉంటాయో నిర్దేశించలేదు. కాబట్టి రాష్ట్రపతి రద్దు చేసే వరకు ప్రాంతీయ సంఘాలు అమలులో ఉంటాయి. 1958, ఫిబ్రవరిలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీ తమ ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్​ అంచనాలను చర్చించే అధికారం లేదు. 

ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీతోపాటు పంజాబ్​ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడమైంది. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనాలు ప్రతిపాదనల బిల్లులను చర్చించి ఆమోదించే అధికారం ఉంది. పంజాబ్​ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రాంతీయ సంఘాలకు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఏర్పాటు చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్​లోని తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ప్రశ్నోత్తరాల సమయానికి అవకాశం కల్పించలేదు. 

ప్రాంతీయ కమిటీ నిర్మాణం 

తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. 9 మంది సభ్యులను తెలంగాణలోని ఆనాటి తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు జిల్లాల వారీగా ఎన్నుకుంటారు. ఆరుగురు సభ్యులు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు లేదా పార్లమెంట్​ సభ్యులై ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు అందరు కలిసి ఎన్నుకుంటారు. ఐదుగురు సభ్యులు శాసనసభ్యులు కాని వారు ఉంటారు. వీరిని తెలంగాణ శాసన సభ్యులు ఎన్నుకుంటారు. తెలంగాణ ప్రాంత మంత్రులందరూ పదవిరీత్యా ప్రాంతీయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చైర్మన్​, డిప్యూటీ చైర్మన్​ ఉంటారు. రాష్ట్ర గవర్నర్ ప్రాంతీయ కమిటీ చైర్మన్​ ఎన్నికకు తేదీని ప్రకటిస్తారు. తెలంగాణ ప్రాంతీయ సభ్యులందరూ కలిసి చైర్మన్​ను, డిప్యూటీ చైర్మన్​ను ఎన్నుకుంటారు. ఓటింగ్​ పద్ధతిని పంజాబ్​ ప్రాంతీయ సంఘ ఎన్నికల్లో అనుసరించిన విధంగా బహిరంగ ఓటింగ్ పద్ధతిని అనుసరించారు. 

అధ్యక్షులు                                            ఉపాధ్యక్షులు                                                          పదవీకాలం

కె. అచ్యుతరెడ్డి                                        ఎం. మసుమా బేగం                                                   1958-62
టి.హయగ్రీవాచారి                                టి.రంగారెడ్డి                                                                    1962-67
జె.చొక్కారావు                                           కె.రాజమల్లు                                                                 1967-72
కోదాటి రాజమల్లు                                సయ్యద్​ రహమత్ అలీ                                                  1972-73