నా చేతిలో ఏం లేదు.. వాళ్ల పని వాళ్లు చేస్తారు: RGV కేసులపై డిప్యూటీ CM పవన్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆర్జీవీ  కేసుల విషయంపై పవన్ కల్యాణ్‎ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తారు.. లా అండ్ ఆర్డర్, రాష్ట్ర హోం శాఖ నా దగ్గర లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు విషయంలో ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు వెనకాముందాడుతున్నారోనని అన్నారు. 

పోలీసుల తీరును సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర నుండి వచ్చే జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు వాడలేదన్నారు. జల్‌జీవన్‌ బడ్జెట్‌ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు మేం అనుభవిస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో కేవలం సమోసాల కోసం రూ. 9కోట్లు ఖర్చు చేశారని అసహనం వ్యక్తం చేశారు. అదానీపై అవినీతి ఆరోపణల వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం రేపు (నవంబర్ 26) ప్రధాని మోదీని కలుస్తున్నాని చెప్పారు.

 కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి ప్రతి పక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‎ను తప్పుగా  చిత్రీకరించడంతో పాటు.. వీరిపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అనుచిత పోస్టులు పెట్టాడని ఏపీలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలంటూ ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు. 

ALSO READ | RGV ఎక్కడున్నా వదిలేది లేదు.. ఏపీ పోలీసుల గాలింపు ముమ్మరం

రెండు సార్లు ఆర్జీవీ విచారణకు డుమ్మా కొట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్  చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని రాంగోపాల్ వర్మ నివాసానికి వచ్చారు. ఇంట్లో వర్మ లేకపోవడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు వెయిట్ చేసి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ  ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లపై 2024, నవంబర్ 26న విచారణ చేపట్టిన హైకోర్టు.. బుధవారానికి (నవంబర్ 27) వాయిదా వేసింది.