రూ.2 లక్షల కోట్లతో 7 లక్షల మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విశాఖ: బలమైన భారత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని.. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్. వివిధ అభివృద్ధి పనులు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని మోడీ బుధవారం (జనవరి 8) ఏపీ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ  ఏయూలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. 

ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో పాటు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మారు.. అందుకే ఎన్నికల్లో అండగా నిలబడ్డారన్నారు. ఎన్డీఏను గెలిపించారు కాబట్టే ఇప్పుడు ఏపీకి రూ.2లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 7 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. 

ALSO READ| ఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో

మూరుమూల గ్రామాల్లో రోడ్లకు కూడా ప్రధాని మోడీ వెన్నుదన్నుగా నిలిచారని ప్రశంసించారు. గత ఐదేళ్లు అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోతే మోడీ ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు.  ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‎ను నడిపిస్తోన్న మోడీకి నా నమస్కారాలు అన్నారు. తెలుగు ప్రజలను అభివృద్ధిలో నడిపిస్తోన్న దార్శనికులు చంద్రబాబు అని కొనియాడారు.