ధరణిని అడ్డుపెట్టుకొని ..లక్షన్నర కోట్ల భూదందా : డిప్యూటీ సీఎం భట్టి

  • దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది
  • హైదరాబాద్​ పరిధిలోనే 15 వేల ఎకరాలు చేతులు మారినయ్
  • భూ అక్రమాలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తమని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు ధరణిని అడ్డుపెట్టుకొని లక్షన్నర కోట్ల భూదందాకు పాల్పడ్డారని, ఆ అక్రమాలతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క హైదరాబాద్ ​పరిధిలోనే 15 వేల ఎకరాల భూములు చేతులు మారాయని, త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ తో అన్నింటినీ బయటపెడ్తామన్నారు. బుధవారం సభలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో భట్టి చిట్ చాట్ చేశారు. 

బీఆర్ఎస్ హయాంలో ఓ వ్యక్తి రెండు, మూడేండ్లపాటు ప్రతి రోజూ ప్రభుత్వ భూములను కాజేసే పనిలోనే ఉన్నడు.. పార్ట్- బీలో ఉన్న వివాదాస్పద భూములను క్లియర్​చేసి కావాల్సినవాళ్ల పేర్లతో బదిలీ చేయించుకున్నరు. ఒక్క హైదారాబాద్ పరిధిలోనే ఇలాంటి భూములు సుమారు 15 వేల ఎకరాల దాకా ఉంటాయనే అంచనా.. అంత కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.. పార్ట్ బీలో ఉన్న భూములను ఒక ప్లాన్​ ప్రకారం తమవాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.. ఆ తర్వాత ఇతరుల పేర్ల మీద మ్యూటేషన్ చేశారు.. ఇలా పెద్ద దందా జరిగింది’’ అని డిప్యూటీ సీఎం వివరించారు. 

ALSO READ : కబ్జా భూములు వెనక్కి..ఆక్రమించుకున్నోళ్లను వదిలేది లేదు :  మంత్రి పొంగులేటి

ఇనాం, ఎండోన్మెంట్, వక్ఫ్, భూదాన్ భూములన్నీ ఇలా లూటీ చేశారని, చాలా భూముల యజమానులు దేశంలో కూడా లేరని, వారంతా పాకిస్థాన్ వెళ్లారని, ఎవ్వరూ అభ్యంతరం చెప్పకపోవడంతో అధికారులు సైతం సహకరించారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌లో అన్ని నిజాలూ నిగ్గు తేలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క తెలిపారు.