మన్మోహన్ సింగ్ అరుదైన, అసామాన్య మనిషి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: ప్రముఖ ఆర్థిక  వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం (డిసెంబర్ 30) ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ఆయన జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని.. కఠిన నిర్ణయాలతో దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. 

భారత్‎లో ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరిచి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రధానిగా పేదల అభ్యున్నతి కోసం అనేక చట్టాలకు రూప కల్పన చేశారన్నారు. ఎవరూ ఊహించని విధంగా సమాచార సేకరణ హక్కు చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం భారత దేశ గతినే మార్చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్‎ది కీలక పాత్ర అన్నారు. మన్మోహన్ సింగ్ అరుదైన, అసామాన్య మనిషి అని ఆర్థిక సంస్కరణలవాదిపై ప్రశంసల వర్షం కురిపించారు భట్టి. 

Also Read :- మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి

2024, డిసెంబర్ 26వ తేదీన అనారోగ్యంతో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సింగ్ కు సంతాపం తెలపాలని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ భేటీ అయ్యి.. మన్మోహన్ సింగ్‎కు నివాళుర్పించారు సభ్యులు.