ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురి నేతల చర్చ
  • ఏఐసీసీ అబ్జర్వర్‌‌‌‌గా అపాయింట్​ చేసినందుకు ఖర్గేకు భట్టి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, వెలుగు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాజాజీ మార్గ్‌‌లోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో.. హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవం, రాష్ట్రంలో కుల గణన ప్రణాళిక, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 

అలాగే, కాంగ్రెస్ పాలన తీరుపై ప్రొగ్రెస్ కార్డును అందజేసినట్లు తెలిసింది. రైతులకు రుణ మాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు సమాచారం. దీంతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌గా తనను నియమించినందుకు ఖర్గేకు భట్టి కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా, గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న భట్టి మీడియాకు కాస్త దూరంగానే ఉన్నారు. పలువురు భట్టిని కలిసేందుకు శబరి బ్లాక్‌‌కు వెళ్లగా.. ఆయన ఇక్కడ లేరని తెలంగాణ భవన్ సిబ్బంది తెలిపారు. పలువురు మీడియా ప్రతినిధులు ఫోన్‌‌లో భట్టిని సంప్రదించేందకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కాగా, పార్టీ చీఫ్ ఖర్గేతో భేటీ అనంతరం ఆయన నేరుగా జార్ఖండ్‌‌కు వెళ్లినట్లు ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి.

జార్ఖండ్‌‌లో భట్టికి ఘన స్వాగతం..

ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌గా జార్ఖండ్ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాంచీ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గోసేవ అయోగ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ప్రసాద్, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాంచీలో స్థానిక నేతలతో భట్టి సమావేశమై, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.